Share News

జగన్ మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపం.. పయ్యావుల ఫైర్

ABN , Publish Date - Mar 28 , 2026 | 03:06 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. జగన్ మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపంగా కనిపిస్తున్నాయని అన్నారు. జగన్‌కు అధికారం తప్ప ప్రజల ఆకాంక్షలు కనిపించవంటూ మండిపడ్డారు.

జగన్ మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపం.. పయ్యావుల ఫైర్
Amaravati capital issue

అమరావతి, మార్చి 28: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాటలు మోసం, కుట్ర, నయవంచనకు ప్రతిరూపంగా కనిపిస్తున్నాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్‌కు అధికారం తప్ప ప్రజల ఆకాంక్షలు కనిపించవంటూ మండిపడ్డారు. తెలుగుజాతికి చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో తమలాంటి వారు ఆ సభలో ఉన్నారని, తెలుగుజాతి బాగుండాలని చంద్రబాబు పడిన తపన తాము చూశామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ నిబ్బరం కోల్పోలేదని తెలిపారు.


ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘సీఎంగా ఉండి కూడా బస్సులో పడుకున్నారు. ఈ కార్యాలయాన్ని సీఎం కార్యాలయంగా చేసుకుని పని చేశారు. 53 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు. అవతల వైపు ఎంతమంది మారినా.. ఇటువైపు చంద్రబాబు ఒక్కరే నిలబడ్డారు. రాష్ట్రం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1995-2004 మధ్య చంద్రబాబు తెచ్చిన 63 ప్రాజెక్టుల్లో.. 2004 తర్వాత వైఎస్ 62 ప్రాజెక్టులను కొనసాగించారు. కానీ, జగన్ మాత్రం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిరగదోడారు’..


‘జగన్ సొంతంగా ఒక్క ప్రాజెక్టు తెచ్చింది లేదు. ఒక్క ఇటుక పెట్టి పని చేసింది లేదు. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని ప్రజలు చేసిన పోరాటం మా కళ్ల ముందు ఉంది. విభజన కష్టాలతో ఉన్న సమయంలో నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం మేం పని చేశాం. కానీ జగన్ మాత్రం ఎలా ఆలోచించారో ఈ వీడియోల ద్వారా ప్రజలు చూశారు. జగన్ 3 రాజధానులకు అప్పటి సభ్యులు చప్పట్లు కొట్టారు. కేవలం బటన్ నొక్కడంతోనే ప్రజల బతుకులు సాగాలని జగన్ కోరుకున్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌తో లక్షన్నర ఉద్యోగాలు వస్తాయి. జగన్ మాత్రం పురిట్లో బిడ్డను చంపినట్లు అమరావతిని చంపాలని చూశారు’..


‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమరావతిని నిలబెట్టేందుకు కృషి చేశారు. వైసీపీ నేతలు ఓ వైపు రాజదాని కావాలంటారు.. మరోవైపు అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారని ప్రచారం చేస్తారు. రాజధాని అంటే కేవలం నాలుగు భవనాలు కాదు. రాజధాని గ్రోత్ ఇంజిన్‌లా ఉండాలని చంద్రబాబు భావించారు. హైదరాబాద్ విషయంలో ఇదే విషయం రుజువైంది. అదే తరహా నగరం ఏపీ రాజధానిగా ఉండాలని చంద్రబాబు భావించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని యువకులకు సైతం మాకు మంచి రాజధాని ఉందనుకునేలా చేశారు. రెండున్నరేళ్లపాటు అమరావతి నిర్మాణ పనులు పరుగులు తీశాయి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

బీజేపీ వస్తే బుల్డోజర్లతో అందర్నీ గెంటేస్తుంది.. మమతా బెనర్జీ

భారత్‌లో మెడిసిన్స్ ధర ఇంత తక్కువా! ఫారిన్ మహిళ వీడియో వైరల్

Updated Date - Mar 28 , 2026 | 03:24 PM