ఐపీఎల్‌పై ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:52 PM
ఐపీఎల్ 2026 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఒక జట్టుకు 240 పైచిలుకు స్కోర్ చేసినా కూడా గెలుపు గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఒక జట్టుకు 240 పైచిలుకు స్కోర్ చేసినా కూడా గెలుపు గ్యారంటీ లేదు. ఇటీవల జరిగిన మ్యాచులే అందుకు నిదర్శనం. అలానే 200పై స్కోర్ అంటే చాలా సింపుల్ అవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 30 సార్లకుపైగా రెండొందల స్కోర్లు నమోదయ్యాయి. దీంతో బౌలర్లు ఆటబొమ్మలుగా మారారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రికెట్ వృద్ధి కంటే అభిమానులను అలరించడం, స్పాన్సర్లు, వ్యూయర్స్ ఆసక్తే కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు.
'భారీగా పరుగులు రావడం అనేది కచ్చితంగా పిచ్ వల్లే జరుగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. పిచ్ నుంచి బౌలర్లకు అంతగా సహకారం లభించడం లేదు. మరోవైపు బౌండరీలు కూడా దగ్గరగా ఉండటం బౌలర్లకు కష్టంగా మారింది. అదే ఇటు బౌలింగ్‌కూ సహకరించేలా పిచ్‌ను రెడీ చేస్తే.. ప్రేక్షకులకు బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. ఐపీఎల్ స్ట్రక్చర్ అలానే ఉంది. ఈ విషయంలో బౌలర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదు' అని ముత్తయ్య తెలిపాడు.
'2020 నుంచి మ్యాచులు చూసేవారు ఐపీఎల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువగా కోరుకుంటారు. అందులోనూ ఫోర్లు, సిక్స్‌లు చూడాలని ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసం ఐపీఎల్‌లో చాలా మార్పులు చేశారు. ఇంపాక్ట్ నిబంధన కారణంగా అదనంగా బ్యాటర్ రావడం వల్ల.. 200 మార్క్ ఈజీగా కనిపిస్తోంది. ఈ మెగా లీగ్ ప్రారంభం వెనుక చాలా అంశాలుంటాయి. క్రికెటర్లకు అవకాశాలు వస్తున్నాయి. అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోంది. ప్రస్తుతం ఇది పెద్ద వ్యాపారం. ఆట విసుగు తెప్పిస్తే.. ప్రజలు లీగ్‌కు దూరమవుతారు. అప్పుడు స్పానర్లతో పాటు వీక్షకులనూ కోల్పోయే పరిస్థితి వస్తుంది’ అని ముత్తయ్య విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్! జైలా..ఫైనా?