Share News

టీ20 ప్రపంచ రికార్డు సృష్టించిన జయదేవ్ ఉనాద్కత్

ABN , Publish Date - Nov 27 , 2026 | 04:00 PM

టీమిండియా క్రికెటర్ ఉనాద్కత్ జయ్‌దేవ్‌.. టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 11వ బ్యాటర్‌గా క్రీజ్‌లోకి వచ్చి విధ్వంసం సృష్టించాడు. ఇక చివరి వికెట్‌కు గొప్ప భాగస్వామ్యం నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషించాడు.

టీ20 ప్రపంచ రికార్డు సృష్టించిన జయదేవ్ ఉనాద్కత్
Jaydev Unadkat

స్పోర్ట్స్ డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (ఎస్‌ఎంఏటీ) 2026–27లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ బ్యాట్‌తో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గురువారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఉనాద్కత్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో 11వ స్థానంలో వచ్చిన బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం. గతంలో బిగ్ బాష్ లీగ్‌లో డానీ బ్రిగ్స్ (35 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును ఉనాద్కత్ అధిగమించాడు.


సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో సౌరాష్ట్ర తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 20 ఓవర్లలో 8 వికెట్లకు 192 పరుగులు చేసింది. సన్నీ సంధూ (44), ఆండ్రే సిద్ధార్థ్ (38), సచిన్ (37), రాజ్‌కుమార్ (36) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర టాప్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలి 92 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఉనాద్కత్.. చేతన్ సకార్యా (21 నాటౌట్)తో కలిసి 10వ వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.


టీ20ల్లో చివరి వికెట్‌కు ఇది సంయుక్తంగా రెండో అత్యధిక భాగస్వామ్యం (పీఎస్‌ఎల్‌లో గ్రాంట్ ఇలియట్, జుల్ఫీకర్ బాబర్ 63 పరుగులు అగ్రస్థానం). ఉనాద్కత్ పోరాడినా సౌరాష్ట్ర 16.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటై 38 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమితో సౌరాష్ట్ర సూపర్ లీగ్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా, టీ20ల్లో 11వ స్థానంలో భారత బ్యాటర్ల అత్యధిక స్కోరు రికార్డు (మునాఫ్ పటేల్ - 23)తో పాటు ముస్తాక్ అలీ ట్రోఫీ రికార్డు (పంకజ్ జైస్వాల్, ప్రశాంత్ సోలంకి - 23) కూడా ఉనాద్కత్ ఖాతాలో చేరింది. ఇతడు చివరిగా టీమిండియా తరఫున నాలుగేళ్ల కిందట మ్యాచ్‌ ఆడాడు.


టీ20ల్లో 11వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు

  • జయదేవ్ ఉనద్కట్-40 (ఇండోర్, 2026)

  • డానీ బ్రిగ్స్-35*(హోబార్ట్, 2020)

  • డొమినిక్ డ్రేక్స్-34*(బాసెటెర్రే, 2019)

  • ఖాలిద్ అహ్మది-31*(మార్సా, 2021)

  • ముజీబ్ ఉర్ రెహమాన్-27(బ్రిస్బేన్, 2018)


ఇవి కూడా చదవండి:
అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..

డీలిమిటేషన్ ఆమోదానికి మ్యాజిక్ ఫిగర్ 360.. మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

Updated Date - Nov 27 , 2026 | 04:01 PM