ఇక్కడా పరుగుల వరదేనా?
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:49 AM
ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, వెస్టిండీస్ చెరో విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. రాంచీ వేదికగా రెండో మ్యాచ్‌లో మొత్తంగా...
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నేడు మూడో టీ20
గెలుపే లక్ష్యంగా భారత్, విండీస్
ఇండోర్: ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, వెస్టిండీస్ చెరో విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. రాంచీ వేదికగా రెండో మ్యాచ్‌లో మొత్తంగా 38.3 ఓవర్లలోనే 501 పరుగులు నమోదైన విషయం తెలిసిందే. కరీబియన్ల ఊచకోతతో 19వ ఓవర్‌లోనే 250 రన్స్ ఛేదన పూర్తయ్యింది. ఇక.. ఆదివారం స్థానిక హోల్కర్ స్టేడియంలో మూడో టీ20 జరుగనుండడంతో.. ఇక్కడా బ్యాటర్లు విజృంభించే అవకాశం ఉంది. బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో పాటు సహజంగా ఇక్కడి ఫ్లాట్‌పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన చివరి మూడు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు వరుసగా 337, 399, 385 స్కోర్లు చేయడం గమనార్హం.
హోప్‌ను నిలువరిస్తేనే..
విండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌ను ఎలా నిలువరించాలో భారత బౌలర్లకు అర్థం కావడం లేదు. వన్డే సిరీస్‌లో అదరగొట్టిన తను పొట్టి ఫార్మాట్‌లోనూ ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుత టూర్‌లో హోప్ ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ ఉండడం విశేషం. కచ్చితంగా నేటి మ్యాచ్‌లో అతడిని అడ్డుకోవడంపైనే భారత ప్రణాళికలు ఉండాలి. ఇక ఫీల్డింగ్ వైఫల్యం కూడా రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణమైంది. రూథర్‌ఫోర్డ్ 38 రన్స్ దగ్గర ఇచ్చిన క్యాచ్‌ను మయాంక్ వదిలేయడం విండీస్ పాలిట వరమైంది. ఆ తర్వాత అతడు మరో 46 పరుగులు జత చేయడమే కాకుండా హోప్‌తో కలిసి 54 బంతుల్లోనే 120 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. మరోవైపు ఓపెనర్ శాంసన్ ఫామ్ అందుకోవడం శుభసూచకం. అలాగే కెప్టెన్ శ్రేయాస్ నిలకడగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నా.. రెండు మ్యాచ్‌ల్లోనూ పవర్‌ప్లే దాటలేదు. ఇక ఇషాన్, తిలక్ హిట్టింగ్ భారీ స్కోరుకు దోహదపడుతోంది. ఇక, ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో నితీశ్ కుమార్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు. పేసర్ అర్ష్‌దీప్ రెండు మ్యాచ్‌ల్లో 79 పరుగులిచ్చి తీసింది ఒక్క వికెట్టే. మయాంక్ మాత్రం నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో స్పిన్నర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
హెట్‌మయెర్ ఫామ్‌పై ఆందోళన
కెప్టెన్ హోప్ నిలకడకు తోడు రూథర్‌ఫోర్డ్ రెండు వరుస హాఫ్ సెంచరీలతో ఫామ్ చాటుకోవడం విండీస్‌కు అనుకూలించనుంది. అయితే జట్టులో ఆందోళన కలిగించే విషయం హెట్‌మయెర్ వైఫల్యమే. ఈ సిరీస్‌లో అతడు ఐదు పరుగులే చేయడంతో ఒత్తిడి పెరుగుతోంది. ఐపీఎల్ ద్వారా ఇక్కడి మైదానాల్లో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ హెట్‌మయెర్ తడబడుతున్నాడు. నేటి మ్యాచ్‌లో సత్తా చూపకపోతే జట్టులో చోటు కూడా కష్టమే. అలాగే సీపీఎల్‌లో చెలరేగిన ఓపెనర్ కమిల్ పూరన్ భారత పిచ్‌లను అర్థం చేసుకోలేకపోతున్నాడు. మిడిలార్డర్‌లో రొమారియో షెఫర్డ్ కీలక ఇన్నింగ్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. బౌలింగ్‌లో స్పిన్నర్ కీమర్ రోచ్ ఒక్కడే భారత బ్యాటర్లను నిలువరిస్తున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, శాంసన్, ఇషాన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, నమన్, నితీశ్/దూబే, అక్షర్, కుల్దీప్, మయాంక్, అర్ష్‌దీప్.
వెస్టిండీస్: హోప్ (కెప్టెన్), కమిల్, హెట్‌మయెర్, పోవెల్, రూథర్‌ఫోర్డ్, షెఫర్డ్, చేజ్, స్ర్పింగర్, హోసీన్, షామార్ జోసెఫ్, మోటీ.
పిచ్, వాతావరణం
హోల్కర్ స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. వన్డేల్లో సెహ్వాగ్ డబుల్ సెంచరీ ఇక్కడే నమోదైంది. అయితే ఈ మైదానంలో చివరి టీ20 మ్యాచ్ 2024, జనవరిలో జరగడం గమనార్హం. ఈ మ్యాచ్‌లోనూ మంచు ప్రభావం అధికంగా ఉండనుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!
ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్
టీమిండియాతో సిరీస్.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ