Share News

భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి నేటికి 43 ఏళ్లు

ABN , Publish Date - Jun 25 , 2026 | 05:47 PM

భారత క్రికెట్ చరిత్రలో 1983 జూన్ 25వ తేదీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది.

భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి నేటికి 43 ఏళ్లు
India 1983 World Cup win

స్పోర్ట్స్ డెస్క్: మనిషికైనా, జట్టుకైనా తొలి విజయం ఎప్పటికీ మధురమైన జ్ఞాపకమే. భారత క్రికెట్ చరిత్రలో 1983 జూన్ 25వ తేదీ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. హోమ్ ఆఫ్ క్రికెట్ అని పిలవబడే లార్డ్స్ మైదానంలో అప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏమాత్రం ఓటమి ఎరుగని వెస్టిండీస్ జట్టును చిత్తుగా ఓడించి విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది.


వరల్డ్ కప్1983 టోర్నీకి ముందు భారత జట్టుపై ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. గతంలో జరిగిన రెండు ప్రపంచ కప్పుల్లో కూడా కనీసం గ్రూప్ దశను కూడా దాటలేక దారుణంగా విఫలమైంది. ఆ 2 టోర్నీల్లోనూ కప్పు గెలిచిన వెస్టిండీస్ జట్టు అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడాలని కసితో బరిలోకి దిగిన విండీస్.. అంచనాలకు తగ్గట్లుగానే ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు కపిల్ సేన మాత్రం ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరి క్రికెట్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.


ఈ క్రమంలో టాస్ గెలిచిన విండిస్ జట్టు సారథి క్లైవ్ లాయిడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ (38), మొహిందర్ అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) మాత్రమే మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. విండీస్ బౌలర్ల ధాటికి 54 ఓవర్లలో భారత జట్టు కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోరు చూసిన వాళ్లంతా విండీస్ విజయం ఖాయమని అనుకున్నారు. కప్పు మనకు రావడం కష్టమేలే అని సగటు భారతీయు తీవ్ర నిరాశలో ఉండిపోయారు.


కానీ భారత బౌలర్లు మాత్రం కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి వెస్టిండీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో 57 పరుగులకే విండీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 76 పరుగుల వద్ద 6 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై భారత్ జట్టు గట్టి పట్టు సాధించింది. వివియన్ రిచర్డ్స్ 33 పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసినా కపిల్ దేవ్ అద్భుతమైన క్యాచ్‌తో అందుకున్నాడు. దీంతో దీంతో విండీస్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యాయి. భారత బౌలర్లలో మదన్ లాల్, అమర్‌నాథ్‌తో పాటు బల్వీందర్ సంధూ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో వెస్టిండీస్ కేవలం 140 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. మొట్ట మొదటి సారి విశ్వవిజేతగా అవతరించింది.


సరిగ్గా 43 ఏళ్ల క్రితం లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతూ పైకి ఎత్తిన దృశ్యం ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమాని కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. 1983 నాటి అద్భుత విజయం తర్వాత మళ్లీ 28 ఏళ్లకు 2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇటీవల 2023లో రోహిత్ శర్మ నాయకత్వంలో ఫైనల్ చేరిన భారత్.. రన్నరప్ గా మిగిలిపోయింది.


ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 25 , 2026 | 05:58 PM