Share News

అభిషేక్‌ ధనాధన్‌

ABN , Publish Date - Oct 12 , 2026 | 01:52 AM

పరుగులు వెల్లువెత్తుతాయని భావించిన మూడో టీ20లో బంతికి, బ్యాట్‌కు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉన్న ఈ మైదానంలో మొదట భారత బ్యాటర్లు చేసింది 223 స్కోరు. ఇది ప్రత్యర్థికి తక్కువ లక్ష్యమే అని అనుకున్నా.. మన బౌలర్లు ఈసారి తమ పదును చూపించారు.

అభిషేక్‌ ధనాధన్‌
Arshdeep Singh , Abhishek Sharma

  • 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ

  • అదరగొట్టిన అర్ష్‌దీప్‌

  • మూడో టీ20లో విండీస్‌పై భారత్‌ గెలుపు

ఇండోర్‌: పరుగులు వెల్లువెత్తుతాయని భావించిన మూడో టీ20లో బంతికి, బ్యాట్‌కు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉన్న ఈ మైదానంలో మొదట భారత బ్యాటర్లు చేసింది 223 స్కోరు. ఇది ప్రత్యర్థికి తక్కువ లక్ష్యమే అని అనుకున్నా.. మన బౌలర్లు ఈసారి తమ పదును చూపించారు. కరీబియన్ల హిట్టింగ్‌కు ముకుతాడు వేశారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మూడో టీ20లో భారత్‌ 14 పరుగుల తేడాతో గెలిచి సిరీ్‌సలో 2-1 ఆధిక్యం అందుకుంది. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ భారత్‌ గెలుపులో కీలకంగా నిలిచింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 37), తిలక్‌ వర్మ (28) రాణించారు. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడింది. హెట్‌మయెర్‌ (26 బంతుల్లో 43), కమిల్‌ పూరన్‌ (42), స్ర్పింగర్‌ (11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 నాటౌట్‌), రూథర్‌ఫోర్డ్‌ (32) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్‌దీ్‌పనకు 3, నమన్‌కు 2 వికెట్లు దక్కాయి. నాలుగో మ్యాచ్‌ బుధవారం హైదరాబాద్‌లో జరుగుతుంది.


దెబ్బతీసిన అర్ష్‌దీప్‌: ఛేదనలో విండీ్‌సకు రెండో ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ హోప్‌ (5)ను అర్ష్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే కమిల్‌, హెట్‌మయెర్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరి జోరుకు పవర్‌ప్లేలో జట్టు 54/1 స్కోరుతో నిలిచింది. కానీ ఏడో ఓవర్‌లో హెట్‌మయెర్‌ను నమన్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పోవెల్‌ (5) మళ్లీ నిరాశపర్చగా.. 11వ ఓవర్‌లో కమిల్‌ను కూడా నమన్‌ దెబ్బతీశాడు. ఈ దశలో రూథర్‌ఫోర్డ్‌.. శాంప్సన్‌ సహకారంతో ఐదో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. 18వ ఓవర్‌లో పాల్‌, రూథర్‌ఫోర్డ్‌లను అర్ష్‌దీప్‌ అవుట్‌ చేయడంతో విండీస్‌ ఓటమి ఖరారైంది. చివరి ఓవర్‌లో స్ర్పింగర్‌ 6,4,6,6తో బాదుడు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.


ఆదుకున్న అభిషేక్‌-ఇషాన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలో ఇబ్బందిపడినా.. ఓపెనర్‌ అభిషేక్‌, ఇషాన్‌ల ఎదురుదాడితో స్కోరు దూసుకెళ్లింది. రెండో వికెట్‌కు ఈ జోడీ 40 బంతుల్లోనే 108 పరుగులను నమోదు చేసింది. ఆ తర్వాత తిలక్‌, నితీశ్‌ (21), అక్షర్‌ (20) కాసేపు క్రీజులో నిలవడంతో స్కోరు 200 దాటగలిగింది. మరోవైపు ఫామ్‌లోకి వచ్చాడనుకున్న ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (3)కు షాకిస్తూ అతడిని షమార్‌ జోసెఫ్‌ అవుట్‌ చేశాడు. అయితే మూడో ఓవర్‌లో అభిషేక్‌ 4,6,6తో గేరు మార్చాడు.


అటు ఇషాన్‌ సైతం పాల్‌ ఓవర్‌లో 3 ఫోర్లు రాబట్టడంతో స్కోరు గాడిన పడింది. ఆరో ఓవర్‌లోనూ అభిషేక్‌ 6,4,4తో చెలరేగి 18 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. మరోవైపు పవర్‌ప్లేలో భారత్‌ 87/1 రన్స్‌తో నిలిచింది. 8వ ఓవర్‌లోనే జట్టు స్కోరు వందకు చేరిన దశలో స్పిన్నర్‌ చేజ్‌ డబుల్‌ ఝలక్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో ఇషాన్‌, శ్రేయాస్‌ (1)ల వికెట్లు తీశాడు. ఆ వెంటనే అభిషేక్‌, నమన్‌ (10) కూడా వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరారు. ఈ దశలో తిలక్‌, నితీశ్‌ జోడీ ఆరో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అలాగే లోయరార్డర్‌లో ప్రిన్స్‌ (13 నాటౌట్‌), అర్ష్‌దీప్‌ (11) ఫర్వాలేదనిపించగా భారత్‌ సవాల్‌ విసిరే స్కోరందుకుంది.


బౌండరీ వెళ్లిందనుకుని..

జోరు మీదున్న తిలక్‌ వర్మ అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 17వ ఓవర్‌లో మోటీ వేసిన లో ఫుల్‌ టాస్‌ను అక్షర్‌ బలంగా ఆడాడు. సింగిల్‌ పూర్తి చేశాక వీరిద్దరు రెండో రన్‌ కోసం ప్రయత్నించారు. కానీ బంతి బౌండరీకి వెళ్లిందని భావించి తిలక్‌ తన పరుగును మధ్యలోనే ఆపి నెమ్మదిగా నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌ వైపు నడుచుకుంటూ వచ్చాడు. అయితే అప్పటికే ఆ బంతిని అద్భుతంగా ఆపిన కమిల్‌.. కీపర్‌ హోప్‌నకు త్రో వేయగా తను బౌలర్‌ మోటీకి అందించాడు. అప్పటికి నింపాదిగా వస్తున్న తిలక్‌ను మోటీ రనౌట్‌ చేయడంతో షాక్‌కు గురయ్యాడు.

  • అంతర్జాతీయ టీ20ల్లో తక్కువ బంతుల్లో (1024) 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా అభిషేక్‌. అలా గే ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు (68) బాదిన బ్యాటర్‌ (శాశ్వ త సభ్యదేశాల నుంచి)గా సూర్యకుమార్‌తో సంయుక్తంగా టాప్‌లో నిలిచాడు.


స్కోరుబోర్డు:

భారత్‌: శాంసన్‌ (సి) కమిల్‌ (బి) జోసెఫ్‌ 3, అభిషేక్‌ (సి అండ్‌ బి) స్ర్పింగర్‌ 69, ఇషాన్‌ (స్టంప్‌) హోప్‌ (బి) చేజ్‌ 37, శ్రేయాస్‌ (ఎల్బీ) చేజ్‌ 1, తిలక్‌ (రనౌట్‌) 28, నమన్‌ (సి) స్ర్పింగర్‌ (బి) మోటీ 10, నితీశ్‌ (సి) హోప్‌ (బి) పాల్‌ 21, అక్షర్‌ (రనౌట్‌) 20, అర్ష్‌దీప్‌ (ఎల్బీ) స్ర్పింగర్‌ 11, ప్రిన్స్‌ (నాటౌట్‌) 13, మయాంక్‌ (బి) జోసెఫ్‌ 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 223 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-7, 2-115, 3-117, 4-124, 5-135, 6-169, 7-194, 8-202, 9-210, 10-223; బౌలింగ్‌: చేజ్‌ 4-0-38-2, జోసెఫ్‌ 4-0-54-2, పాల్‌ 4-0-38-1, స్ర్పింగర్‌ 4-0-50-2, మోటీ 4-0-37-1.


వెస్టిండీస్‌: హోప్‌ (బి) అర్ష్‌దీప్‌ 5, కమిల్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) నమన్‌ 42, హెట్‌మయెర్‌ (బి) నమన్‌ 43, పోవెల్‌ (సి) ఇషాన్‌ (బి) అక్షర్‌ 5, రూథర్‌ఫోర్డ్‌ (బి) అర్ష్‌దీప్‌ 32, శాంప్సన్‌ (సి) తిలక్‌ (బి) నితీశ్‌ 21, పాల్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్‌దీప్‌ 10, స్ర్పింగర్‌ (నాటౌట్‌) 35, చేజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 209/7. వికెట్ల పతనం: 1-7, 2-67, 3-82, 4-105, 5-151, 6-169, 7-174; బౌలింగ్‌: మయాంక్‌ 4-0-34-0, అర్ష్‌దీప్‌ 4-0-44-3, ప్రిన్స్‌ 4-0-37-0, నమన్‌ 3-0-39-2, అక్షర్‌ 3-0-33-1, నితీశ్‌ 2-0-19-1.


ఇవి కూడా చదవండి:

విండీస్‌తో మూడో టీ20: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్లు!

టెస్టుల్లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. జో రూట్ రికార్డు బద్దలు

Updated Date - Oct 12 , 2026 | 01:52 AM