వెస్టిండీస్‌పై వివక్ష.. క్లారిటీ ఇచ్చిన ఐసీసీ
ABN , Publish Date - Mar 11 , 2026 | 02:43 PM
ఇటీవల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే..
స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే అయింది. ఇరాన్ లో యుద్ధం కారణంగా ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. చార్టర్ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న ఐసీసీ ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన విండీస్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.
చివరకు మంగళవారం రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్‌లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్(England) సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల వెస్టిండీస్(West Indies) హెడ్‌కోచ్ డారెన్ సామీ, ప్లేయర్ ఆకీల్ హొసేన్ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.
ఈ ఆరోపణలపై ఐసీసీ(ICC) తాజాగా స్పందించింది. ' వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు ప్రపంచ కప్‌లో వారి ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం. వారు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడంలో అర్థం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. చార్టర్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది' అని ఓ ప్రకటనలో ఐసీసీ పేర్కొంది. అలానే మైకేల్ వాన్ (Michael Vaughan) విమర్శలపై కూడా ఐసీసీ స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని, మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్ దేశాల గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని ఐసీసీ స్పష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి:
అదంతా నా భార్య ప్లాన్.. ఫ్యాన్స్ కంట పడకుండా దూబే రైలు ప్రయాణం
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్