విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన బాబర్ ఆజం..
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:52 PM
పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ బాబర్ ఆజం మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20) టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున డెబ్యూ మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం, తన తొలి మ్యాచ్‌లోనే అర్థశతకంతో మెరిశాడు. తద్వారా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ బాబర్ ఆజం తాజాగా ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20) టోర్నీలో మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఐఎల్‌టీ20 టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున డెబ్యూ మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం.. తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్ వైపర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈక్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు.
షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం 51 బంతుల్లో 86 పరుగులు చేశాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు 80+ స్కోర్లు సాధించిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీని అధిగమించాడు. ఆజంకు ఇది 31వ 80 ప్లస్ స్కోర్. అలానే కోహ్లీ టీ20 క్రికెట్‌లో 30 సార్లు 80 ప్లస్ స్కోరు సాధించాడు. ఓవరాల్ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ 48 సార్లు 80 ప్లస్ స్కోర్లు సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. జోస్ బట్లర్, జేమ్స్ విన్స్ , డేవిడ్ వార్నర్‌లతో కలిసి బాబర్ ఆజం 31 సార్లు 80 ప్లస్ స్కోర్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కింగ్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు.
దీంతో పాటు బాబర్ ఆజం మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐఎల్‌టీ20 టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. 2025 సీజన్‌లో ముంబై ఎమిరేట్స్‌తో మ్యాచ్‌లో అమెరికా బ్యాటర్ ఆండ్రీ గౌస్ తొలి స్థానంలో ఉన్నాడు. అతడు 58 బంతుల్లో 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఐఎల్‌టీ20 టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున సెంచరీ సాధించిన ఏకైక ప్లేయర్‌గా ఆండ్రీ గౌస్ ఉన్నాడు.
టీ20ల్లో అత్యధిక 80+ స్కోర్లు
క్రిస్ గేల్-48
బాబర్ ఆజం-31*
జోస్ బట్లర్-31
జేమ్స్ విన్స్-31
డేవిడ్ వార్నర్-31
విరాట్ కోహ్లీ-30
ఇవి కూడా చదవండి:
భారత సైన్యం కీలక నిర్ణయం.. సైనికుల మొబైల్ ఫోన్లలో 87 యాప్‌లు నిషేధం
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు ఇవ్వడానికి ఓకే: ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్