మ్యాచ్‌ల సంఖ్య పెంపు!.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:11 PM
ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోందని సమాచారం. భవిష్యత్తులో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు.
స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటి. దీనిపై ఆసక్తి ఎంతగా ఉందంటే. కొంతమంది స్టార్ ఆటగాళ్లు తమ జాతీయ జట్టులో ఆడటం కంటే ఈ టీ20 లీగ్‌లో ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు త్వరలో ఐపీఎల్ మ్యాచుల సంఖ్య74 నుంచి 94కు పెరుగుతుందనే ఊహగానాలు ప్రారంభమయ్యాయి. దీనిపై తాజాగా ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మొత్తం మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అరుణ్ ధుమాల్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ... టీ20 క్రికెట్‌పై అభిమానులకు ఆసక్తి పెరుగుతున్న దృష్ట్యా ఐపీఎల్‌ను మరింత విస్తృతపరచాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. అందువల్లే ఈ లీగ్‌లో 94 మ్యాచ్‌లు నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అప్పుడు ప్రతి జట్టు వేరే జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న మార్పులను గమనిస్తే, కొన్ని ద్వైపాక్షిక మ్యాచ్‌లపై ఆసక్తి తగ్గుతూ వస్తోందని.. అందుకే ఆయా దేశాలు తమ సొంత లీగ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ 'ది హండ్రెడ్', ఆస్ట్రేలియా 'బిగ్ బాష్ లీగ్', యూఏఈ 'ఇంటర్నేషనల్ లీగ్ టీ20', దక్షిణాఫ్రికా 'ఎస్ఏ20' 'కరేబియన్ ప్రీమియర్ లీగ్' లను నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ప్రతి సీజన్‌లో ఒక్కో ఫ్రాంచైజీ.. ఇతర జట్లలోని ఐదింటితో రెండుసార్లు, నాలుగు జట్లతో ఒక్కోసారి తలపడుతోంది. అనంతరం ప్లేఆఫ్స్, ఫైనల్ కలిపి మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒకవేళ టోర్నమెంట్‌ను 94 మ్యాచ్‌లకు విస్తరిస్తే.. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండుసార్లు ఆడాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి సీజన్‌లో ఒక్కో జట్టు మొత్తం 18 మ్యాచ్‌లు ఆడుతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్
సంజుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు