మహిళల టీ20లో చరిత్ర సృష్టించిన రువాండా క్రికెటర్
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:23 PM
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో రువాండా క్రికెటర్ ఫ్యానీ ఉటగుషిమానిండే సరికొత్త రికార్డు సృష్టించింది. నైజీరియా ఇన్విటేషన్ల మహిళల అంతర్జాతీయ టీ20 టోర్నీలో భాగంగా రువాండా, ఘనా మధ్య మ్యాచ్ జరిగింది.
స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో రువాండా క్రికెటర్ ఫ్యానీ ఉటగుషిమానిండే(Fanny Utagushimaninde) సరికొత్త రికార్డు సృష్టించింది. నైజీరియా ఇన్విటేషన్ల మహిళల అంతర్జాతీయ టీ20 టోర్నీలో భాగంగా రువాండా, ఘనా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఫ్యానీ (65 బంతుల్లో 111) అద్భుతమైన సెంచరీ చేసింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అతిపిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పింది. 15 ఏళ్ల 223 రోజుల వయసులో ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది. అలానే మహిళల అంతర్జాతీయ టీ20 చరిత్రలో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి క్రీడాకారిణిగా మరో రికార్డును కూడా ఫ్యానీ సొంతం చేసుకుంది.
అతి పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు గతంలో ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా అలకో(Proscovia Alako) పేరిట ఉంది. అలకో 2019లో మాలీపై 116 పరుగులు చేసింది. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్ల 233 రోజులు. తాజాగా ఆ రికార్డును ఫ్యానీ బ్రేక్ చేసింది. ఇక 2005లో టౌంటన్‌లో ఇంగ్లండ్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ కారెన్ రోల్టన్ నెలకొల్పిన ఓ రికార్డునూ ఫ్యానీ అధిగమించింది. అరంగేట్ర మ్యాచ్‌లో కారెన్ 96 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇప్పుడు సెంచరీతో ఫ్యానీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. అలానే మహిళల అంతర్జాతీయ టీ20 అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గానూ ఫ్యానీ నిలిచింది.
టీ20ఐ అరంగేట్రంలో నలుగురు పురుష క్రికెటర్లు శతకాలు సాధించినప్పటికీ, వారిలో ఎవరూ పూర్తి సభ్య దేశాలకు చెందినవారు లేరు. అలానే పురుషుల క్రికెట్‌లో అంతర్జాతీయ టీ20 సెంచరీ రికార్డు అత్యంత పిన్న వయస్కుడైన ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్(18 ఏళ్ల 280 రోజులు) పేరిట ఉంది. అతడు స్విట్జర్లాండ్‌పై శతకం చేసి రికార్డు సృష్టించాడు. తాజాగా గుస్తావ్ రికార్డును కూడా ఫ్యానీ బ్రేక్ చేసి.. అంతర్జాతీయంగా తక్కువ వయసులోనే శతకం చేసిన క్రికెటర్‌గా అవతరించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రువాండా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 210 పరగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఘనా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి. కేవలం 88 పరుగులకే పరిమితమైంది. తన అద్భుతమైన సెంచరీతో రువాండా విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యానీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
సంజూకు మామయ్యలాంటి వాణ్ని: శశిథరూర్