Share News

ఫుట్‌బాల్‌ దేశంలో క్రికెట్‌ క్రేజ్‌

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:07 PM

ఇటలీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఫుట్‌బాల్‌. దాదాపు ఆరు కోట్ల జనాభా ఉన్న దేశంలో అత్యధికులు సాకర్‌ ఆటకు ప్రాణమిస్తారు. నాలుగుసార్లు ఆ దేశ జట్టు ఫిఫా వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది.

ఫుట్‌బాల్‌ దేశంలో క్రికెట్‌ క్రేజ్‌

ఇటలీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఫుట్‌బాల్‌. దాదాపు ఆరు కోట్ల జనాభా ఉన్న దేశంలో అత్యధికులు సాకర్‌ ఆటకు ప్రాణమిస్తారు. నాలుగుసార్లు ఆ దేశ జట్టు ఫిఫా వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది. రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. యువెంటస్‌, ఏసీ మిలాన్‌, ఇంటర్‌ మిలాన్‌ వంటి ప్రఖ్యాత క్లబ్బుల నిలయం ఇటలీ. పౌలో మాల్డిని, రాబర్ట్‌ బాగియో, ఫ్రాంకో బరేసి వంటి స్టార్లు తమ ఆటతో అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. అలాంటి ఇటలీలో క్రికెట్‌కు క్రేజ్‌ ఉండడం వింత అయితే..ఆ దేశ జట్టు ఏకంగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడుతుండడం ఎంతో ఆశ్చర్యకరం.

18వ శతాబ్దంలోనే..

ఇటలీకి క్రికెట్‌ కొత్తేం కాదు. 1793లోనే ఆ దేశంలో క్రికెట్‌ మొదలైంది. బ్రిటిష్‌ నావికుల ద్వారా నేపుల్స్‌లో క్రికెట్‌ ఆటకు అడుగులు పడ్డాయి. వాస్తవంగా ఏసీ మిలాన్‌, జెనోవా క్లబ్బులు..తొలుత క్రికెట్‌ క్లబ్బులుగా ప్రారంభమయ్యాయట. తదనంతర కాలంలో ఫుట్‌బాల్‌ ఆట బాగా ప్రాచుర్యం పొందడంతో ఇటలీలో క్రమంగా క్రికెట్‌ కనుమరుగైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో క్రికెట్‌ పునరుద్ధరణకు నోచుకుంది. 1960లో రోమ్‌లో అద్భుతమైన క్రికెట్‌ గ్రౌండ్‌ రూపు దిద్దుకుంది. ‘రోమ్‌ యాషెస్‌’ పేరిట 1970 వరకు క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగేవి. ఆస్ట్రేలియా, బ్రిటిష్‌ ఎంబసీలు, ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ విభాగం, కామన్వెల్త్‌ వార్‌ గ్రేవ్స్‌ అసోసియేషన్‌ తదితర జట్లు ‘రోమ్‌ యాషెస్‌’ ట్రోఫీ కోసం తలపడేవి. 1970వ దశకం చివర్లో రోమ్‌లోనే రెండో క్రికెట్‌ మైదానాన్ని తయారు చేశారు. 1980లో డోరియా పాంఫిలి క్రికెట్‌ క్లబ్‌ ఏర్పడింది. తర్వాత ఇటలీ ఉత్తర ప్రాంతంలో మిలాన్‌ క్రికెట్‌ క్లబ్‌ పునఃప్రారంభంకాగా, యురేటమ్‌ సీసీ అనే మరో క్లబ్బు కూడా ఏర్పడింది.


book8.2.jpgఐసీసీ గుర్తింపు..

1980లో ఇటాలియన్‌ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆవిర్భవించింది. 1984లో ఆ ఫెడరేషన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) గుర్తింపును పొందింది. 1984 ఆగస్టులో ఇటలీ క్రికెట్‌ జట్టు అధికారికంగా యూకేలో పర్యటించింది. ఇక..1989లో ఇటలీ మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నది. 1995లో ఐసీసీ అనుబంధ దేశంగా మారింది. 1997లో ఐసీసీ ట్రోఫీ టోర్నీలో తలపడింది. తదుపరి ఏడాది జరిగిన యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లోనూ ఆడింది. ఆ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌ లెవెన్‌ జట్టును ఓడించడం ద్వారా ఇటలీ పెను సంచలనం సృష్టించింది. యూఏఈలో జరిగిన ఐసీసీ 2013 టీ20 క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఇటలీ తలపడింది. తమ అనుబంధ సభ్య దేశాలన్నింటికీ పూర్తిస్థాయి టీ20లలో పాల్గొనేందుకు 2018లో ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆటతీరును క్రమంగా మెరుగు పరుచుకుంటూ వచ్చిన ఇటలీ టీ20 వరల్డ్‌ కప్‌ యూరప్‌ క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించింది. తద్వారా ఆ జట్టు తొలిసారి ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్‌కు క్వాలిఫై అయ్యింది.


జట్టులో అన్నదమ్ములు నలుగురు..

15 మంది సభ్యుల ఇటలీ జట్టులో ఓ ప్రత్యేకత ఉంది. నలుగురు అన్నాతమ్ముళ్లు ఉండడమే ఆ స్పెషాలిటీ. వీరిలో బెంజమిన్‌ మానెంటి-హ్యారీ మానెంటి అన్నదమ్ములు. వీరిద్దరు సమర్థులైన బ్యాటర్లేకాక, తిరుగులేని ఫీల్డర్లు. ఇక ఆంథోని మోస్కా-జస్టిన్‌ మోస్కా మరో సోదర ద్వయం. వీరిద్దరూ బ్యాటర్లు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు

ఆర్ఎస్ఎస్‌‌ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్‌ ఖాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2026 | 01:07 PM