ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ కొత్త హీరో.. అసలు ఎవరీ కూపర్ కనోలీ!
ABN , Publish Date - Apr 01 , 2026 | 09:32 AM
న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ వైపు వర్షం.. మరోవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు పంజాబ్ ఓపెనర్ కూపర్ కనోలీ.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంతో పాటు ఉత్కంఠగా కొనసాగుతోంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ వైపు వర్షం.. మరోవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒంటరి పోరాటం చేసి జట్టుకు విజయాన్ని అందించాడు పంజాబ్ ఓపెనర్ కూపర్ కనోలీ. అరంగేట్రంలోనే పంజాబ్ తరఫున 44 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అదరహో అనిపించాడు. ప్రస్తుతం కూపర్ కనోలీ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఈ కనోలీ ఎవరంటే..
కూపర్ కనోలీ ఆస్ట్రేలియా క్రికెటర్. ఈ 22 ఏళ్ల యువ ఆల్‌రౌండర్.. ఆసీస్ క్రికెట్ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఐపీఎల్ 2026 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. కనోలీ 2022 అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బిగ్ బాష్ లీగ్ 2022-23 ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ తరఫున కేవలం 11 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. అలాగే 2023-24 షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్లో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే 90 పరుగులు చేసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది శ్రీలంకపై టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. అదనంగా 8 వన్డేలు, 11 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కనోలీకి ఉంది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లో కానోలీ అద్భుత ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడాడు. ‘ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అవకాశం కోసం ఎదురుచూశాను. జట్టుకు అవసరమైనప్పుడు మంచి ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది నాది కాదు.. జట్టు విజయం’ అని కనోలీ తెలిపాడు. మొత్తానికి తొలి మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన కనోలీ, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కీలక ఆటగాడిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
విషాదం.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దూబె ఔట్ అయినప్పుడు గన్ సెలబ్రేషన్స్.. జడ్డూ ఏమన్నాడంటే?