Share News

ప్రపంచకప్‌లో పుంజుకున్న బ్రెజిల్.. మాథ్యూస్ డబుల్ ధమాకా!

ABN , Publish Date - Jun 20 , 2026 | 09:35 AM

ఫిఫా ప్రపంచకప్‌ 2026లో బ్రెజిల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. తొలి మ్యాచ్‌లో మొరాకోతో 1-1తో డ్రా చేసుకొని బ్రెజిల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే శుక్రవారం జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో హైతీని చిత్తు చేసింది.

ప్రపంచకప్‌లో పుంజుకున్న బ్రెజిల్.. మాథ్యూస్ డబుల్ ధమాకా!
Brazil vs Haiti

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. తొలి మ్యాచ్‌లో మొరాకోతో 1-1తో డ్రా చేసుకొని బ్రెజిల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే శుక్రవారం జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో హైతీని చిత్తు చేసింది. ఈ విజయంతో బ్రెజిల్ నాకౌట్ రేసులో ముందంజ వేసింది. మరోవైపు వరుసగా రెండో ఓటమితో హైతీ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.


బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలొట్టి జట్టులో చేసిన మార్పులు సఫలమయ్యాయి. గాయంతో స్టార్ ఆటగాడు నెయ్‌మార్ దూరం కాగా.. ఇగోర్ థియాగో స్థానంలో జట్టులోకి వచ్చిన ఫార్వర్డ్ ఆటగాడు మాథ్యూస్ కన్హా రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 23వ నిమిషంలో కన్హా బ్రెజిల్‌కు తొలి గోల్ అందించాడు. వినీషియస్ జూనియర్ కొట్టిన షాట్‌ను హైతీ డిఫెండర్ క్లియర్ చేసే క్రమంలో కన్హా చాకచక్యంగా బంతిని నెట్‌లోకి పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వినీషియస్ అందించిన అద్భుతమైన పాస్‌ను కన్హా ఎడమకాలితో నెట్ వైపు బాది వ్యక్తిగత రెండో గోల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తొలి అర్ధభాగం ముగిసేలోపే లుకాస్ ప్యాక్వెటా అందించిన పాస్‌ను వినీషియస్ జూనియర్ మూడో గోల్‌గా మలిచాడు. దీంతో బ్రెజిల్ తొలి సగభాగంలోనే 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది.


రెండో అర్ధభాగంలో హైతీ జట్టు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ముఖ్యంగా రికార్డో అడే హెడర్ ద్వారా కొట్టిన షాట్‌ను బ్రెజిల్ గోల్‌కీపర్ అలిసన్ బెకర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. చివర్లో బ్రెజిల్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ గాబ్రియేల్ మార్టినెల్లి కొట్టిన షాట్ క్రాస్‌బార్‌కు తగలడంతో ఆ జట్టు మరో గోల్ అవకాశం చేజారింది. గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్.. జూన్ 24న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఇక మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో యూఎస్ఏ ఘన విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో జోరు: ఇస్మాయిల్ సైబారి మెరుపు గోల్!

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!


ఇవి కూడా చదవండి:

ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో జోరు: ఇస్మాయిల్ సైబారి మెరుపు గోల్!

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!

Updated Date - Jun 20 , 2026 | 09:35 AM