టీమిండియా వైఫల్యాలపై బీసీసీఐ సమీక్ష.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:22 PM
వచ్చే నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అయితే జులై 28న దీనికి సంబంధించిన భారత జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అయితే జులై 28న దీనికి సంబంధించిన భారత జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. శ్రీలంక గడ్డపై జరగనున్న ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లకు స్పిన్ పరీక్ష ఎదురు కానుంది. ముఖ్యంగా టర్నింగ్ పిచ్‌లపై విదేశాల్లో ఇటీవల భారత బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ పర్యటన కీలకంగా మారింది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలపై బీసీసీఐ సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు సైకియా వెల్లడించారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు పరాజయాలు, ఆటతీరు, వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఈ సమీక్ష అనంతరం జట్టు సహాయక సిబ్బంది భవిష్యత్తుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గంభీర్ బృందంపై వేటు?
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సహాయక బృందంలో కీలక సభ్యులైన ర్యాన్ టెన్, టీ దిలీప్‌ల ఒప్పందాలు ముగిశాయి. వీరి కొనసాగింపుపై బీసీసీఐ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్న దిలీప్ గతంలో రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బృందంలో భాగంగా ఉన్నారు. ప్రతి మ్యాచ్ అనంతరం అత్యుత్తమ ఫీల్డర్‌కు పతకం అందించే కార్యక్రమంతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఇటీవలి కాలంలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు తగ్గడంపై కూడా చర్చ జరుగుతోంది. బీసీసీఐ సమీక్ష సమావేశంలో జట్టు వైఫల్యాలకు కారణాలు, కోచింగ్ బృందం పనితీరు, భవిష్యత్ ప్రణాళికలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే
వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు