డగౌట్‌లో ఫోన్ వాడిన ఆర్ఆర్ టీమ్ మేనేజర్.. స్పందించిన బీసీసీఐ!
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:56 PM
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓ వివాదంలో చిక్కుకుంది. ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ విజయ దుందుభి మోగిస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో అన్నీ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓ వివాదంలో చిక్కుకుంది. దీంట్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా భాగమవ్వడం గమనార్హం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ సమయంలో ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో ఫోన్ వాడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎట్టకేలకు బీసీసీఐ స్పందించింది.
సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఫ్రాంచైజీ ప్లేయర్లు, సిబ్బంది ఫోన్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ డగౌట్‌లోకి మాత్రం అనుమతించరు. అయితే ఆర్ఆర్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్.. ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో ఫోన్ వాడినట్టు వీడియోలు బయటకు వచ్చాయి. కాగా దాంట్లో వైభవ్ సూర్యవంశీ కూడా రోమి పక్కనే కూర్చొని ఫోన్ చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ దానికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో బీసీసీఐ అతడిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘అవును ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ప్రదేశం వద్ద ఎవరూ మొబైల్ ఫోన్లను వాడకూడదు. కానీ భిందర్ మాత్రం ఆ నిబంధనలను ఉల్లఘించారు. టీమ్ మేనేజర్ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ఫోన్‌ను వినియోగించే అవకాశం ఉంది. కానీ డగౌట్‌లో వాడకూడదు. అయితే భిందర్ విషయంలో అనుకోకుండా ఇలా జరిగి ఉండొచ్చు. కానీ అతడు చేసింది మాత్రం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిందే. హెచ్చరిస్తామా? లేదా ఏదైనా చర్యలు తీసుకుంటామా? అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్ రిఫరీతోపాటు అవినీతి నిరోధక యూనిట్ నివేదిక ప్రకారమే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం ఉంటుంది’ అని బీసీసీఐ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
సెంచరీని మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం చేస్తున్నా: సంజు శాంసన్