రోహిత్, కోహ్లీల ఎఫెక్ట్... మారనున్న నిబంధనలు!
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:55 PM
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రో-కో దెబ్బకు బీసీసీఐ.. ఓ నిబంధనను మార్చనుందని సమాచారం.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే మ్యాచులతో సంబంధం లేకుండా వీరిని చూసేందుకే చాలా మంది మైదానాలకు వస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా రోహిత్, కోహ్లీ దెబ్బకు బీసీసీఐ.. ఓ నిబంధనను మార్చనుందని సమాచారం. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన భారత క్రికెటర్లు కచ్చితంగా దేశవాళీల్లో పాల్గొనాలనే నిబంధన బీసీసీఐ (BCCI) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు స్టార్ క్రికెటర్లు సైతం దేశవాళీల్లో పాల్గొంటున్నారు. గతేడాది విరాట్ కోహ్లీ ఢిల్లీ వేదికగా రంజీట్రోఫీ మ్యాచ్ ఆడాడు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియం అభిమానులతో నిండిపోయింది. అలాగే తాజాగా విజయ్ హజారే ట్రోఫీ నేపథ్యంలో జైపూర్‌లో ముంబై తరఫున రోహిత్ శర్మ ఆడిన మ్యాచులకు పెద్దసంఖ్యలో అభిమానులు మైదానానికి వచ్చారు. అయితే రో-కో పాల్గొన్న మ్యాచ్‌ల లైవ్ లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దీంతో బీసీసీఐ బ్రాడ్‌కాస్టింగ్ పాలసీలో మార్పులు తెచ్చే దిశగా అడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్‌తో మాట్లాడారు. ‘ ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడే క్రికెటర్లు దేశవాళీ మ్యాచుల్లో కూడా ఆడుతున్నారు. ఇది ఇటీవలి కాలంలో వచ్చిన అతిపెద్ద మార్పు. దీంతో దేశవాళీ మ్యాచులకు ఆదరణ బాగా పెరిగింది. అయితే ఇదే సమయంలో మాకు అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. మ్యాచ్‌లు ఎక్కడ ప్రసారమవుతున్నాయి?, ఆ మ్యాచ్‌లు ఎందుకు లైవ్ ఇవ్వడం లేదు? అని అభిమానులు అడుగుతున్నారు. అయితే బీసీసీఐ ప్రస్తుతం 100 దేశవాళీ మ్యాచ్‌లను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. కానీ త్వరలోనే ఆ పాలసీని మార్చనున్నాం. స్టార్ క్రికెటర్లు ఆడుతున్నందున.. లైవ్ మ్యాచ్‌ల(BCCI domestic cricket live) సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం’ అని దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు
జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్