పాక్‌కు వెళ్లినా అక్కడికి మాత్రం వెళ్లకండి.. తమ క్రికెటర్లకు ఆసీస్ ప్రభుత్వం హెచ్చరిక
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:36 AM
కాబూల్‌లోని ఆసుపత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ప్లేయర్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌కి వెళ్లినా పెషావర్‌కు మాత్రం వెళ్లొద్దని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 400 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. దీంట్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లుబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తదితర ఆసీస్ ప్లేయర్లు పాల్గొననున్నారు. ఆసీస్ మాజీ క్రికెటర్లు టిమ్ పైన్, గిలెస్పీ ఈ లీగ్‌లో కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాక్‌కు వెళ్లినా పర్లేదు కానీ.. పెషావర్ అనే నగరంలో మాత్రం అడుగు పెట్టొదంటూ ఆసీస్ ప్రభుత్వం వారిని హెచ్చరించింది.
ఆ మ్యాచ్ జరుగుతుందా?
పెషావర్ నగరాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నో ట్రావెల్ జోన్‌లో చేర్చింది. అక్కడ ఏ నిమిషమైనా దాడులు జరగొచ్చంటూ పేర్కొంది. అయితే ఈ నగరంలోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియంలో మార్చి 28న పెషావర్ జల్మీ, రావల్పిండి పిండిజ్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ రెండు జట్లలోనూ ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. జల్మీ జట్టుకు ఆరోన్ హార్డీ, పిండిజ్ టీమ్‌కు జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది. అయితే అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆసీస్ ప్లేయర్లను ప్రైవేటు విమానాల్లో స్వదేశానికి తరలిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అఫ్గాన్ ప్లేయర్ల నిరసన
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎడిషన్‌కు ముందు జరిగిన వేలం నుంచి అఫ్గానిస్థాన్ ప్లేయర్లు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. లాహోర్‌లో జరిగిన వేలం కోసం ముజీబ్ ఉర్ రెహ్మాన్, సిద్ధిఖుల్లా అటల్, మహమ్మద్ నబీ, వకార్ సలామ్‌ఖేల్, ఫజల్ హక్ ఫరూఖీ వంటి ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారని ఓ ఫ్రాంచైజీ యజమాని మొదట ధ్రువీకరించారు. కానీ అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను పెషావర్ జల్మీ జట్టు నేరుగా తీసుకోవడంపై వ్యతిరేకత రావడంతో వారు తమ పేర్లను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
‘సన్‌రైజర్స్’ వివాదం.. రంగంలోకి దిగిన లలిత్ మోదీ!
పాక్ దాడుల గురించి భారత్‌తో చర్చించాలనుకుంటున్నాం: అఫ్గాన్ క్రికెటర్