Share News

పాక్ దాడుల గురించి భారత్‌తో చర్చించాలనుకుంటున్నాం: అఫ్గాన్ క్రికెటర్

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:23 AM

కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 400 మంది మృతి చెందగా.. 250 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ యువ స్పిన్నర్ మొహమ్మద్ ఘజన్‌ఫర్ పాక్ చర్యను తప్పుబట్టాడు.

పాక్ దాడుల గురించి భారత్‌తో చర్చించాలనుకుంటున్నాం: అఫ్గాన్ క్రికెటర్
Mohammad Ghazanfar

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 400 మంది మృతి చెందగా.. 250 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయంపై పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఇప్పటికే ఘాటుగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తాజాగా అఫ్గాన్ యువ స్పిన్నర్ మొహమ్మద్ ఘజన్‌ఫర్.. పాక్ చర్యను తప్పుబట్టాడు. తమ మిత్ర దేశమైన భారత్‌తో ఈ విషయం గురించి చర్చించాలనుకుంటున్నామని అన్నాడు.


‘వాళ్లంతా సామాన్య ప్రజలు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న యువకులు. పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్థాన్ వారి ప్రాణాలను తీసింది. ఆ ప్రజల దగ్గర వైద్యానికి కూడా డబ్బులు లేవు. అలాంటి వారి మీద పాక్ దాడి చేసింది. ఇది ఏ మాత్రం సహించే విషయం కాదు. వారు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. పాక్.. సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీన్ని అఫ్గానిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అఫ్గానిస్థాన్ చరిత్ర గురించి అందరికీ తెలుసు. హిస్టరీ రిపీటైతే.. పాకిస్థాన్‌కు అది మంచిది కాదు.


భారత్ మాకు సన్నిహిత దేశం. వారితో మేం ఈ పాక్ దాడుల గురించి చర్చించాలనుకుంటున్నాం. ప్రపంచ దేశాలకు కూడా మేం విజ్ఞప్తి చేస్తున్నాం. సాధారణ ప్రజల మీద దాడి సరికాదు. ప్రస్తుతం మా దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇది ఎవరికీ మంచిది కాదు’ అని ఘజన్‌ఫర్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: నిలకడ విషయంలో సూర్య మెరుగుపడాలి: మహేల జయవర్దనే

క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్.. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ అక్తర్!

Updated Date - Mar 18 , 2026 | 10:46 AM