ఆసియా క్రీడలు జరగనున్న ప్రాంతంలో భారీ వరదలు.. క్రీడాకారులు సురక్షితం
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:59 PM
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు సర్వం సిద్ధమవుతోంది. సమ్మర్ ఒలింపిక్స్‌ను తలపించేలా ఈ మహా క్రీడా వేడుకకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే క్రీడలు జరిగే ప్రాంతమైన ఐచి-నగోయా నగరంలో భారీ వర్షం కురిసింది.
స్పోర్ట్స్ డెస్క్: సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్నఆసియా క్రీడలకు సర్వం సిద్ధమవుతోంది. సమ్మర్ ఒలింపిక్స్‌ను తలపించేలా ఈ మహా క్రీడా వేడుకకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే, పోటీల ప్రారంభానికి ముందే క్రీడలు జరిగే ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రికార్డు స్థాయి వర్షపాతం కారణంగా నగరంలోని పలు రోడ్లు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడగా, నగరంలో బస్సులు, సబ్‌వే సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అత్యవసర పునరావాస కేంద్రాలకు సుమారు 3,500 మంది తరలివెళ్లినట్లు సమాచారం.
ఈ వరదల గురించి నగోయా నగర మేయర్ ఇచిరో హిరోసావా మీడియాతో మాట్లాడారు. క్రీడాకారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. ఆసియా క్రీడాల కోసం ముందుగానే నగోయా పట్టణానికి చేరుకున్న అథ్లెట్లు అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. తాత్కాలిక వసతి కోసం కంటైనర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో సుమారు 400 మంది అథ్లెట్లు, సిబ్బందిని ఉన్నారని వెల్లడించారు. అలానే కొన్ని క్రీడా వేదికల పైకప్పులు నుంచి నీరు కారిందని పేర్కొన్నారు. ఈ వరదల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని, పోటీల నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేదని హిరోసావా వెల్లడిచారు.
ఈసారి ఆసియా క్రీడల్లో సుమారు 45 దేశాల నుంచి ఏకంగా 11,000 మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. 2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌లో సుమారు 10,700 మంది మాత్రమే పాల్గొనడం గమనార్హం. దీన్నిబట్టి ఒలింపిక్స్‌ను మించిన స్థాయిలో ఈ క్రీడలు సాగనున్నాయని అర్థమవుతోంది. మూడేళ్ల క్రితం చైనాలోని హాంగ్‌జౌ వేదికగా గత ఏషియన్ క్రీడలు విజయవంతంగా ముగిశాయి. క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సంగ్రామానికి జపాన్ సర్వ సన్నద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
వినాయక విగ్రహం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త ప్రయోగం.. ‘మానవవ్యర్థాలతో’ మరింత దృఢంగా కాంక్రీట్!