ఆసియా హాకీ ఛాంపియన్‌గా భారత్.. కోచ్‌ను ఆకాశానికెత్తి ప్లేయర్ల హంగామా!
ABN , Publish Date - Oct 02 , 2026 | 09:08 PM
ఆసియా క్రీడల 2026లో మహిళల హాకీ విభాగంలో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. హాకీ విభాగంలో భారత్ స్వర్ణం సాధించగా... ప్లేయర్లు కోచ్‌ను ఎత్తుకుని హంగామా చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడల 2026లో మహిళల హాకీ విభాగంలో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1-0 తేడాతో మట్టికరిపించి భారత మహిళల జట్టు చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడలకు భారత్ నేరుగా అర్హత సాధించింది.
తన అంతర్జాతీయ కెరీర్‌లో 200వ మ్యాచ్ ఆడుతున్న లాల్‌రెమ్‌సియామి మ్మార్జోట్, ఆట 10వ నిమిషంలోనే లభించిన అవకాశాన్ని అద్భుతమైన బ్యాక్‌హాండ్ ఫినిష్‌తో గోల్‌గా మలిచి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత చైనా పుంజుకుని దాడి పెంచినప్పటికీ, భారత డిఫెండర్లు నిలిచి గెలిచారు. రెండో క్వార్టర్‌లో చైనాకు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను భారత మాజీ కెప్టెన్, గోల్‌కీపర్ సవితా పునియా అద్భుతంగా అడ్డుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఆట చివరి నిమిషాల్లో చైనా తన గోల్‌కీపర్‌ను ఉపసంహరించుకుని అదనపు అటాకర్‌ను మైదానంలోకి దించినప్పటికీ, భారత డిఫెన్స్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. పూర్తి సమయం ముగిసేసరికి 1-0తో విజయం భారత వశమైంది. విజయం అనంతరం భారత క్రీడాకారిణులు తమ హెడ్ కోచ్ స్జోయర్డ్ మరీన్ (Sjoerd Marijne)ను ఆకాశంలోకి ఎగరేస్తూ ఎమోషనల్‌గా జరుపుకున్న వేడుకలు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
44 ఏళ్ల నిరీక్షణకు తెర:
మహిళల హాకీలో భారత్‌కు ఇది రెండో ఆసియా గేమ్‌ల స్వర్ణం మాత్రమే. 1982లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో తొలిసారిగా స్వర్ణం గెలిచిన భారత్, ఆ తర్వాత 1998, 2018లలో రజతాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ టోర్నీ అంతటా భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు 2026: భారత్, పాక్ ఫైనల్‌కు మోసిన్ నఖ్వీ దూరం
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి హాకీలో గోల్డ్ మెడల్