ఆసియా క్రీడలు: త్రుటిలో గోల్డ్ మిస్.. షూటింగ్‌లో ఈషా సింగ్‌కు రజతం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:57 PM
ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. సోమవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో స్వర్ణం కోసం చివరి వరకు పోరాడిన ఈషా.. టై బ్రేకర్‌లో చైనా షూటర్ జియావో చేతిలో పరాజయం పాలైంది. 21 ఏళ్ల ఈషా ఫైనల్లో ఏకంగా ఆరు షూటాఫ్‌లు ఎదుర్కొంది. ఇందులో నాలుగు సిల్వర్, బ్రాంజ్ కోసం జరిగిన పోరు కాగా.. మరో రెండు షూటాఫ్‌లు స్వర్ణం కోసం జరిగాయి. ప్రతిసారీ ఒత్తిడిని తట్టుకుని నిలిచిన ఆమె.. చివరి టై బ్రేకర్‌లో మాత్రం 2-3 తేడాతో ఓడిపోయింది.
ఫైనల్లో ఒక దశలో ఈషా నాలుగో స్థానంలో ఉండటంతో పతకం చేజారే పరిస్థితి కనిపించింది. అయితే కీలక సమయంలో అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఐదింటికి ఐదు షాట్లు లక్ష్యాన్ని తాకడంతో పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న హైదరాబాద్ అమ్మాయి ఈషా.. ఒక్క షాట్ తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది.
పింకీకి కాంస్యం
కురాష్ 78 కిలోల విభాగంలో భారత అథ్లెట్ పింకీ బల్హారాకు కాంస్య పతకం దక్కింది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన అథ్లెట్‌పై పింకీ 0-5 తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్‌పై విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల బాక్సింగ్ పోటీలో వరుసగా తన రెండో పతకాన్ని ఖాయం చేసుకుంది. టోర్నమెంట్‌లో తన మొదటి బౌట్‌లోనే పోటీపడిన లవ్లీనా.. సియోంగ్‌ను 5-0 తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాలకు దూసుకెళ్లింది. దీంతో ఆమె కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్
కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్