అప్పుడు నాకు కోపమొచ్చింది కానీ ఆ విమర్శ నా జీవితాన్నే మార్చేసింది: అశ్విన్
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:36 AM
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్ తొలినాళ్లలో ఫిట్‌నెస్ పరంగా చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. అయితే కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అశ్విన్ ప్రదర్శనపై ఘాటుగా ఓ ఆర్టికల్ రాశాడు. ఈ విషయంపై అశ్విన్ తాజాగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్ తొలినాళ్లలో ఫిట్‌నెస్ పరంగా చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. అయితే కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అశ్విన్ ప్రదర్శనపై ఘాటుగా ఓ ఆర్టికల్ రాశాడు. ఈ విషయంపై అశ్విన్ తాజాగా స్పందించాడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్‌పై మంజ్రేకర్ చేసిన విమర్శలు తొలుత తనకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయని.. అందుకే అతడితో మాట్లాడటం మానేశానని తెలిపాడు. అయితే అవే విమర్శలు తన కెరీర్‌ను మార్చేశాయని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.
‘నా తొలి ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సంజయ్ మంజ్రేకర్ నా గురించి ఓ సుదీర్ఘ ఆర్టికల్ రాశారు. ఆసీస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో దాన్ని పూర్తిగా చదివాను. నాకు చాలా కోపం వచ్చింది.. బాధేసింది. ఆ విషయాన్ని అప్పుడు అంతటితో పక్కన పెట్టేశాను. ఆయనతో పెద్దగా మాట్లాడేవాడిని కూడా కాదు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు నా ఫిట్‌నెస్‌పై చాలా కష్టపడ్డాను. నేను సహజంగా గొప్ప అథ్లెట్‌ను కాదు. అందుకే నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి తీవ్రంగా శ్రమించాను. 2015లో మంజ్రేకర్ మరో కథనం రాస్తూ నా బౌలింగ్‌ను ప్రశంసించారు. అప్పుడు ఆయన నంబర్ తీసుకుని స్వయంగా మెసేజ్ చేశా. ‘అప్పుడు మీరు నా గురించి రాసిన ఆర్టికల్ నా జీవితాన్నే మార్చేసింది. విమర్శల్లో కూడా నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుందని తెలిసింది’ అని మెసేజ్ పెట్టా’ అని అశ్విన్ వివరించాడు.
ఇదిలా ఉండగా.. అశ్విన్ 2024లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి.. దేశం తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. అడిలైడ్‌లో జరిగిన తన చివరి టెస్టులో అశ్విన్ ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఆ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సి హ్యతకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీ ఫోకస్.. టెస్టుల్లో సత్తా చాటుతాడా?