Share News

ఆర్సీబీ కోసం బిడ్ వేస్తా.. అదర్ పూనావాలా ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - Jan 22 , 2026 | 08:56 PM

ఫుల్ క్రేజ్ ఉన్న ఐపీఎల్ ఫ్రాంఛైజీలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో చేతులు మారనుంది. ఆర్సీబీ కొనుగోలు కోసం బిడ్ వేస్తానంటూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఆర్సీబీ కోసం బిడ్ వేస్తా.. అదర్ పూనావాలా ఆసక్తికర పోస్ట్
RCB ownership change

స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru). గత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలవడం బెంగళూరు కొన్నేళ్ల కల. అలాంటి కలను గతేడాది సాకారం చేసుకుంది ఆర్సీబీ. ఇది ఇలా ఉంటే.. త్వరలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతులు మారనుంది. ప్రస్తుత ఆర్సీబీ యజమాని డియాజియో కంపెనీ ఇప్పటికే ఫ్రాంఛైజీ విక్రయ ప్రక్రియను ప్రారంభించింది. 2026 మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడానికి భారత్‌తో పాటు కొన్ని విదేశీ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కూడా చేరింది. ఆ సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా (Adar Poonawalla) కూడా ఆర్సీబీ జట్టును దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


గురువారం అదర్ పూనావాలా(Adar Poonawalla) ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్ట్ చేశారు. ఐపీఎల్‌లోని అత్యుత్తమ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడం కోసం త్వరలో తాను బిడ్‌ను వేస్తానని, అది కూడా పోటీ తత్వంతో, బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 2008లో ఐపీఎల్‌ ఆరంభ సమయంలో యూబీ గ్రూపు అధినేత విజయ్‌ మాల్యా ఆర్సీబీ ఫ్రాంఛైజీని దక్కించుకున్నాడు. అనంతరం మాల్యా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో భారత్‌లోని తన అనుబంధ సంస్థ యునైటెడ్‌ స్పిరిట్స్‌ ద్వారా బెంగళూరు ఫ్రాంచైజీని డియాజియో కొనుగోలు చేసింది. తాజాగా ఆ సంస్థ కూడా ఆర్సీబీ ఫ్రాంఛైజీని విక్రయించేందుకు సిద్ధమైంది. మరోవైపు కొన్ని నివేదికల ప్రకారం ఆర్సీబీ విలువ దాదాపు రెండు బిలియన్‌ డాలర్లుగా ఉంది. మొత్తానికి మరో రెండు నెలల్లో ఆర్సీబీకి కొత్త ఓనర్ రావడం మాత్రం పక్కా అని తెలుస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌లో టీ20 ప్రపంచ కప్ 2026 ఆడేదే లేదు: బీసీబీ

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 22 , 2026 | 09:23 PM