వీరి ఆట.. చూడాలిక
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:43 PM
టీ20లు బ్యాటర్ల విన్యాసాలకు పెట్టింది పేరు. ఈ క్రమంలో పేసర్లయినా, స్పిన్నర్లయినా పొట్టి క్రికెట్‌లో వికెట్లు సాధించడంకంటే కూడా పరుగులను నియంత్రించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారు.
టీ20లు బ్యాటర్ల విన్యాసాలకు పెట్టింది పేరు. ఈ క్రమంలో పేసర్లయినా, స్పిన్నర్లయినా పొట్టి క్రికెట్‌లో వికెట్లు సాధించడంకంటే కూడా పరుగులను నియంత్రించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలా అని ఈ ఆటలో బౌలర్ల పాత్ర ఉండదని చెప్పలేం. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్ల బలహీనతను కనిపెట్టి దానికనుగుణంగా బౌలింగ్‌ను మార్చుకొంటే వికెట్లు పడగొట్టడం సులువే. ఇకపోతే పొట్టి క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ ఇప్పటికే మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఈ మెగా టోర్నీని వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి వరల్డ్‌కప్‌లో అభిమానుల మనసు దోచే ఆటగాళ్లెవరో చూద్దాం.
1. అభిషేక్ శర్మ (భారత్): టీ20 క్రికెట్‌లో బౌలర్లకు సింహస్వప్నంలా మారిన బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ భారత ఓపెనర్‌కు పేసర్‌తో పనిలేదు, స్పిన్నర్‌నయితే అసలు లెక్కే చేయడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లలో గుబులు పుట్టిస్తాడు. అలాగని అతనివి అడ్డదిడ్డమైన షాట్లు కావు. ఈ 25 ఏళ్ల కుర్రాడు క్రీజు బయటకు వచ్చి భారీ సిక్సర్లు కొట్టే తీరు కనులకు విందు. బౌన్సర్లను లాఫ్టెడ్ షాట్లుగా మలిచే తీరు పసందు. దాదాపు 200 స్ట్రయిక్ రేట్‌తో విరుచుకుపడే అభిషేక్ ఈ మెగా టోర్నమెంట్‌లో ఎన్ని రికార్డులు కొల్లగొడతాడనేది ఆసక్తికరం.
మ్యాచ్‌లు-37 (న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లోని 4వ మ్యాచ్ వరకు)
పరుగులు-1267
స్ట్రయిక్ రేట్ : 194
అత్యధిక స్కోరు: 135
సెంచరీలు: 2
2. సూర్యకుమార్ యాదవ్ (భారత్): టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో ఆడిన సునామీ ఇన్నింగ్స్ ఎన్నో. ఆ ఆటతీరుతోనే అతడు ఏకంగా భారత జట్టు టీ20 కెప్టెన్సీ దక్కించుకున్నాడు. అయితే సారథిగా బాధ్యతలు చేపట్టాక సూర్య ఆట గతి తప్పినా..వరల్డ్ కప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా మునుపటి సూర్యకుమార్‌ను సాక్షాత్కరింపజేశాడు. అభిషేక్‌కు సూర్య తోడైతే ప్రత్యర్థి జట్లు కకావికలం కాక తప్పదు.
మ్యాచ్‌లు : 102
పరుగులు : 2959
స్ట్రయిక్ రేట్ : 165.03
అత్యధిక స్కోరు: 117
సెంచరీలు : 4
3. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా): ఈ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు వెన్నుముకలాంటి ఆటగాడు హెడ్. మిచెల్ మార్ష్‌తో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతూ, వేగంగా పరుగులు చేయడం ఈ లెఫ్ట్ హ్యాండర్ స్టైల్. ఇతడికి బౌలింగ్ చేయడం ఏ బౌలర్‌కైనా క్లిష్టమే.
మ్యాచ్‌లు : 47
పరుగులు : 1197
స్ట్రయిక్ రేట్ : 156.67
అత్యధిక స్కోరు : 91
4. డెవాల్డ్ బ్రేవిస్ (దక్షిణాఫ్రికా) : డెవాల్డ్ బ్రేవిస్‌ను టీ20ల భవిష్యత్ తారగా క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంతిని కొట్టాడంటే బౌండరీ దాటాల్సిందే. బేబీ ఏబీ డివిల్లీర్స్‌గా ప్రశంసలందుకుంటున్న 22 ఏళ్ల బ్రేవిస్ సౌతాఫ్రికా దేశవాళీ టీ20 క్రికెట్‌లో ఓ సంచలనం. గత వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన సఫారీలు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయడంలో బ్రేవిస్ పాత్ర కీలకం.
మ్యాచ్‌లు : 20
పరుగులు : 469
స్ట్రయిక్ రేట్ : 173.70
అత్యధిక స్కోరు : 125 నాటౌట్
5. హార్దిక్ పాండ్యా : టీమిండియాకు సమతూకం తెచ్చే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. మిడిల్ ఓవర్లలో కీలకమైన వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఫార్మాట్‌లో విలువైన ఆటగాడయ్యాడు. బౌలర్‌గా హార్దిక్‌ను మ్యాచ్ భిన్న సమయాల్లో దించడం అతడి బౌలింగ్ సమర్థతకు తార్కాణం. ఽధనాధన్ బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చగలడు. ఇటీవల 2000 రన్స్, 100 వికెట్లతో ‘డబుల్’ సాధించడం అతడి ‘ఆల్‌రౌండ్’ సత్తాను తెలియజేస్తుంది.
మ్యాచ్‌లు : 127
పరుగులు : 2027
స్ట్రయిక్ రేట్ : 143.65
అత్యధిక స్కోరు : 71 నాటౌట్
6. జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) : టీ20ల డెత్ ఓవర్లలో తిరుగులేని పేసర్. చివరి ఓవర్లలో అతడు సంధించే విభిన్న యార్కర్లను కాచుకోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు కానిపని. ఎంత ఒత్తిడి తరుణాల్లోనైనా శాంతంగా ఉండడం బుమ్రా ప్రత్యేకం. అందుకే డెత్ ఓవర్లలో అతడు సులువుగా వికెట్లు తీయగలుగుతాడు.
మ్యాచ్‌లు : 85
వికెట్లు : 106
ఎకానమీ : 6.40
ఉత్తమ బౌలింగ్ : 3/7
7. రషీద్ ఖాన్ (అఫ్ఘానిస్థాన్) : నిలకడైన బౌలింగ్, వికెట్లు తీసే నైపుణ్యం..వెరసి టీ20 చరిత్రలో రషీద్ ఖాన్‌ను మేటి బౌలర్‌గా నిలిపాయి. పిచ్ ఎలాంటిదైనా తన వైవిధ్య బౌలింగ్‌తో వికెట్లు రాబట్టడం ఈ అఫ్ఘానిస్థాన్ లెగ్ స్పిన్నర్‌కు వెన్నతో పెట్టిన విద్య. వికెట్లు ఎన్ని పడగొట్టినా ఎకానమీ తక్కువగా ఉండడం రషీద్ బౌలింగ్‌లో ప్రత్యేకం.
మ్యాచ్‌లు : 111
వికెట్లు : 187
ఎకానమీ : 6.02
ఉత్తమ బౌలింగ్ : 5/3
8. షహీన్ షా అఫ్రీది (పాకిస్థాన్) : సమకాలీన పేసర్లలో వికెట్‌కు ఇరువైపులా బంతిని స్వింగ్ చేయగలిగిన వారిలో షహీన్ షా అఫ్రీది ముందుంటాడు. అందుకే అలనాటి ‘స్వింగ్ సుల్తాన్’ వసీమ్ అక్రమ్ వారసుడిగా అఫ్రీది పేరు పొందాడు. పరుగులను నియంత్రిస్తూనే పవర్ ప్లే ఓవర్లలో నిలకడగా వికెట్లు తీయడంలో షహీన్ సిద్ధహస్తుడు. పాకిస్థాన్ పేస్ బౌలింగ్‌కు అఫ్రీదియే ఆయువుపట్టు.
మ్యాచ్‌లు : 96
వికెట్లు : 126
ఎకానమీ : 7.71
ఉత్తమ బౌలింగ్ : 4/22
9. వనిందు హసరంగ (శ్రీలంక) : గూగ్లీలతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే ఈ శ్రీలంక లెగ్గీ..నమ్మకస్తుడైన బ్యాటర్ కూడా. పదునైన బంతులు విసిరే ఇతడి బౌలింగ్‌లో పరుగులు చేయడానికి స్పెషలిస్టు బ్యాటర్లు సైతం వెనకాడతారు.
మ్యాచ్‌లు : 92
వికెట్లు : 151
ఎకానమీ : 6.96
ఉత్తమ బౌలింగ్ : 4/9
10. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) : వరల్డ్ క్లాస్ లెగ్‌స్పిన్నర్లలో ఒకడైన రషీద్ ఇంగ్లండ్ టీ20 జట్టులో ఎంతో కాలంగా కీలక భూమిక పోషిస్తున్నాడు. గూగ్లీలతో బ్యాటర్లను తికమకపెడుతూ..మధ్య ఓవర్లలో నిలకడగా వికెట్లు తీయడంలో ఆదిల్ పేరు పొందాడు. బ్యాటర్లను నిశితంగా పరిశీలిస్తూ అందుకు తగ్గట్టు బౌలింగ్ చేయడం ఆదిల్ ప్రత్యేకం.
మ్యాచ్‌లు 134
వికెట్లు : 145
ఎకానమీ : 7.48
ఉత్తమ బౌలింగ్ : 4/2.
- వనం కళ్యాణ్
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్ ఖాన్
Read Latest Telangana News and National News