ఇంగ్లండ్‌లో విషాదం.. పులి దాడిలో యువకుడి మృతి..
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:01 AM
ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. పార్క్‌లోని పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై పులి దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. పార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై పులి దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సౌత్ యార్క్‌షైర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాన్‌కాస్టర్ సమీపంలోని ఈ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో శనివారం మధ్యాహ్నం 1:35 గంటలకు ఓ యువకుడు పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. దీంతో పులి అతనిపై దాడి చేసింది. అయితే, బాధితుడు గట్టిగా అరుస్తూ దానిని గద్దించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
పులి పలుమార్లు దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీపు, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. పార్క్ అధికారుల సమాచారం మేరకు అత్యవసర సేవల సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అయితే, వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ యువకుడి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఘటనా స్థలంలోనే అతడు మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. కాగా, మృతుడి వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే, బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ప్రత్యేక అధికారుల ద్వారా వారికి సహాయం అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనలో పులికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ అధికారులు స్పందించారు. పులి దాడి సమయంలో పార్క్‌లో అత్యవసర భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సందర్శకులను వెంటనే బయటకు తరలించినట్లు పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, ఆదివారం వరకు పార్క్‌ను మూసివేయనున్నట్లు ప్రకటించారు. అయితే, అసలు ఏం జరిగింది? ఆ వ్యక్తి పులుల ఎన్‌క్లోజర్‌లోకి అతను ఎందుకు వెళ్లాడు? అనే ప్రశ్నలకు ఇంకా అధికారిక సమాధానాలు వెల్లడికాలేదు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, పులి దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అర్ధరాత్రి భర్త కోసం భార్య చేసిన పని.. నెటిజన్ల మనసు గెలుచుకున్న ప్రేమకథ..
ఆరు భటూరాల్లో.. గ్లాసు నిండా నూనె! వీడియో వైరల్