ప్రపంచంలోనే ప్రత్యేకమైన రోడ్డు.. వాహనం వెళ్తే పాట వినిపిస్తుంది!
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:13 PM
రోడ్డుపై వాహనం నడుపుతుంటే లోపల పాటలు వినిపించడం సహజమే. కానీ రోడ్డు నుంచి పాట వినిపిస్తే? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరాలో ఉన్న ఓ ప్రత్యేక రహదారిపై వాహనం ప్రయాణిస్తుంటే.. టైర్ల కదలికకు అనుగుణంగా సంగీతం వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా రోడ్డు అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఉపయోగించేదే. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరాలో ఉన్న ఈ రహదారి మాత్రం అందుకు పూర్తి భిన్నం. వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటే.. చక్రాల కదలికకు అనుగుణంగా సంగీతం వినిపిస్తుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత పొడవైన సంగీత రహదారిగా పిలుస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ ప్రత్యేక రహదారికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుమారు 0.71 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి ఫుజైరా ఫైన్ ఆర్ట్స్ అకాడమీని కలుపుతుంది.
ఈ మ్యూజికల్ రోడ్డులోని ప్రత్యేక రంబుల్ స్ట్రిప్స్‌పై వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు వాటి టైర్ల నుంచి భిన్నమైన శబ్దాలు వస్తుంటాయి. వాహనం గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో సరైన రీతిలో ప్రయాణించినప్పుడు ఆ శబ్దాలన్నీ కలిసి ప్రముఖ సంగీతకారుడు లుడ్విగ్ వాన్ బీథోవెన్ రూపొందించిన ‘ఓడ్ టు జాయ్’ స్వరాలు వినిపిస్తాయి. డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఉపయోగించే రంబుల్ స్ట్రిప్స్‌ను ఇక్కడ వినూత్నంగా ఉపయోగించారు. దీంతో రోడ్డే ఒక భారీ సంగీత వాయిద్యంలా మారిపోయింది. ఈ ప్రత్యేక అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి..
వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్
ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు