Share News

బార్బెక్యూ మంటల్లో నవ వధువు.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన భయానక ఘటన..

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:02 AM

పశ్చిమ బెంగాల్‌‌లోని కలింపాంగ్ జిల్లాలో ఓ నవ దంపతుల హనీమూన్ విషాదంగా మారింది. సిటాంగ్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బార్బెక్యూ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నవ వధువును చుట్టుముట్టాయి.

బార్బెక్యూ మంటల్లో నవ వధువు.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన భయానక ఘటన..
Sitong Resort Fire

పశ్చిమ బెంగాల్‌: కలింపాంగ్ జిల్లాలో ఓ నవ దంపతుల హనీమూన్ విషాదంగా మారింది. సిటాంగ్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బార్బెక్యూ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నవ వధువును చుట్టుముట్టాయి. దీంతో సరదాగా గడిపేందుకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


చోప్రా ప్రాంతానికి చెందిన సమీర్ దాస్‌కు రెండు నెలల కిందట నికితాతో వివాహం అయ్యింది. నూతన వధూవరులు సరదాగా గడిపేందుకు సిటాంగ్‌కు చేరుకున్నారు. ఓ రిసార్ట్‌లో బస చేస్తూ అక్కడి పర్వత ప్రాంతాలను ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ నెల 13న రాత్రి రిసార్ట్‌లోని బార్బెక్యూ సమీపంలో వారిద్దరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. వారి ఎదురుగా మరో వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు. అతను కాసేపటి తర్వాత లేచి, ఓ క్యాన్‌లో ఉన్న ద్రవాన్ని మంటపై పోశాడు. ఆ వెంటనే ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగి వారిని చుట్టుముట్టాయి. దీంతో నికితకు మంటలు అంటుకున్నాయి. ఆమె విలవిల్లాడుతూ నేలపై పడిపోగా.. భర్త సమీర్ వెంటనే ఆమెను రక్షించేందుకు యత్నించాడు. మంటలకు కారణమైన వ్యక్తి కూడా తన టీ-షర్ట్‌ను విప్పి వాటిని ఆర్పేందుకు ప్రయత్నించాడు.


ఊహించని రీతిలో మంటలు చెలరేగడంతో రిసార్ట్‌లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. రిసార్ట్ సిబ్బంది వెంటనే స్పందించి నికితను ఆస్పత్రికి తరలించగా, చికిత్స కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సరదాగా గడపాల్సిన నవ వధూవరుల విహారయాత్ర విషాదంగా మారడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్‌లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో లేకపోవడంపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఈమె అసలు మనిషేనా.. ఇంత దారుణం ఎలా చేయగలిగిందో!

5 నిమిషాల్లోనే 80 మంది భారతీయ ఉద్యోగుల తొలగింపు

Updated Date - Sep 18 , 2026 | 08:37 AM