షాకింగ్ టెక్నాలజీ.. స్లైమ్ రోబోతో సులభంగా ఆపరేషన్లు..
ABN , Publish Date - Aug 03 , 2026 | 07:14 PM
సాధారణంగా నాణేలు, చిన్న పాటి వస్తువులు, బటన్ బ్యాటరీల వంటి వాటిని పొరపాటున మింగితే ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా నాణేలు, చిన్న పాటి వస్తువులు, బటన్ బ్యాటరీల వంటి వాటిని పొరపాటున మింగితే ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది. అయితే తాజాగా హాంకాంగ్ చైనీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అయస్కాంత స్లైమ్ రోబోతో శస్త్ర చికిత్స అవసరం లేకుండానే వాటిని లోపలి నుంచి బయటకు తీయొచ్చు (Magnetic Slime Robot).
మార్వెల్ సినిమాల్లో కనిపించే 'వెనమ్' పాత్రను పోలి ఉండే అయస్కాంత స్లైమ్ రోబోకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్లైమ్ రోబోలో మోటార్, బ్యాటరీ, వైర్లు వంటివి ఉండవు. పాలీవినైల్ ఆల్కహాల్, బోరాక్స్, నియోడిమియం అయస్కాంత కణాలతో దీనిని తయారు చేశారు. శరీరం బయట నుంచి అయస్కాంత క్షేత్రం ద్వారా ఈ రోబోను అత్యంత ఇరుకైన మార్గాల్లో కూడా కదిలించవచ్చు (Venom Robot).
ఈ స్లైమ్ రోబో సుమారు 1.5 మిల్లీమీటర్లు మాత్రమే ఉండే చిన్న రంధ్రాల గుండా కూడా ప్రయాణించగలదు. దీనితో శస్త్రచికిత్స చేయకుండా పిల్లలు లేదా పెద్దలు పొరపాటున మింగిన వస్తువులను బయటకు తీయవచ్చు. ఈ స్లైమ్ రోబో ప్రత్యేకత ఏమిటంటే, దానిని రెండు ముక్కలుగా విభజించినా తిరిగి తనంతట తానే కలిసిపోతుంది (Medical Technology). అలాగే అనేక రెట్లు పొడవుగా సాగి ఇరుకైన ప్రదేశాల్లోకి చేరగలదు. చిన్న విద్యుత్ సర్క్యూట్లను కలపడం వంటి పనులు కూడా చేయగలదు.
ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఇందులో ఉపయోగిస్తున్న నియోడిమియం కణాలు నేరుగా మానవ శరీరానికి సురక్షితం కావు. అందువల్ల వాటికి ప్రత్యేక రక్షణ పూత అభివృద్ధి చేసి, విస్తృత భద్రతా పరీక్షలు పూర్తి చేయనున్నారు. ఆ తర్వాతే వైద్య వినియోగానికి అనుమతించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..