ఆ గ్రామం... సంగీతమయం...
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:22 PM
ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా సరిగమలు వినిపిస్తాయి. ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు పాటలను హమ్ చేస్తూనే ఉంటారు. ఇక సాయంత్రం అయితే చాలు... అందరూ అరుగులపైకి చేరి గాన గంధర్వులైపోతారు.
ఆ గ్రామంలో ఏ గడప తొక్కినా సరిగమలు వినిపిస్తాయి. ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు పాటలను హమ్ చేస్తూనే ఉంటారు. ఇక సాయంత్రం అయితే చాలు... అందరూ అరుగులపైకి చేరి గాన గంధర్వులైపోతారు. అందుకే ఈ గ్రామం మన దేశంలోనే మొదటి ‘మ్యూజిక్ విలేజ్’గా గుర్తింపు పొందింది. ఇంతకీ ఈ సంగీత గ్రామం ఎక్కడుందంటే...
సంగీతం వారి జీవితంలో ఓ భాగం. తరతరాలుగా జానపద కళాకారులకు నిలయం. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న వాల్ముట్టి గ్రామానికి మొదటి మ్యూజిక్ విలేజ్‌గా గుర్తింపు ఉంది. ఆ గ్రామంలో 54 ఇళ్లున్నాయి. ప్రతి ఇంట్లోనూ సంగీత కళాకారులు కనిపిస్తారు. తరతరాలుగా ఇది కొనసాగుతోంది. అందరు పిల్లలు ఆడుకుంటూ పెరిగితే, ఈ ఊరిలో పిల్లలు మాత్రం భక్తి పాటలు పాడటం నేర్చుకుంటూ పెరుగుతారు.
వాల్ముట్టిలో సాయంత్రమైతే చాలు వీధి దీపాల వెలుగులతో పాటు వినసొంపైన పాటలు వినిపిస్తాయి. పిల్లలందరూ ఇంటి ముందు అరుగుల పైకి చేరి భక్తి పాటలు పాడుతుంటారు. వృద్ధులైతే విష్ణు ఆలయానికి చేరుకుని భక్తిగీతాలను ఆలపించడంలో మునిగిపోతారు. శివుని పాటలు, కృష్ణుడిపై భక్తి పాటలు, సాంప్రదాయ మేల్కొలుపు పాటలు పాడతారు. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు తెల్లవారుఝాము వరకు పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అలా అని వీరు సంగీతంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. వాల్ముట్టి ప్రజలకు సంగీతం ఒక అలవాటు, సాధన, వారసత్వ ఆస్తి.
వార్తాపత్రికలు, డాక్యుమెంట్లు, సోషల్‌మీడియా లేని కాలంలో వాళ్లు సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు. నొటేషన్ పుస్తకాలు, తరగతి గదులు లేవు. కానీ సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని మాత్రం వాళ్ల నమ్మకం. అధికారికంగా మ్యూజిక్ విలేజ్‌గా గుర్తింపు లభించాక గ్రామాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా ఆయా పర్వదినాల్లో విష్ణు ఆలయంలో జరిగే సంగీత కచేరీలను చూడటానికి పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు.
అవార్డు విజేతలున్నారు...
వాల్ముట్టికి చెందిన జానపద గాయని 72 ఏళ్ల థాథమ్మ 2021లో కేరళ జానపద అకాడమీ రాష్ట్ర అవార్డును గెలుచుకున్నారు. ఆమె సంగీతం కోసం జీవితాంతం కృషి చేశారు. ‘ఇక్కడ ప్రతీ ఒక్కరూ సంగీత విద్వాంసులే. మా పూర్వీకులు ఉత్సవ సమయాల్లో పాటలు పాడటం ద్వారా జీవనోపాధి పొందారు. వారి ప్రదర్శనలు చూస్తూ పెరిగిన మేము వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. వారు ఏర్పరచిన దానిని మేము కొనసాగిస్తున్నాం. సంగీతంతో కలిసిపోయి జీవిస్తున్నాం’’ అంటారామె. 75 ఏళ్ల దేవనాయి ‘తుయిలునర్తు పట్టు’ అనే పాటను 60 ఏళ్లుగా పాడుతున్నారు. ఈ పాటను కేవలం ఆమె వినడం ద్వారానే నేర్చుకున్నారు. 2020లో ఆమె కేరళ జానపద అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. ‘‘నేను సంగీతం నేర్చుకోవడానికి ఎప్పుడూ కళాశాలకు గానీ, స్కూల్‌కు గానీ వెళ్లలేదు. పదేళ్ల వయసు నుంచి పాటలు పాడటం నా జీవితంలో భాగంగా మారింది’’ అంటారు దేవనాయి.
కొత్తతరం అందుకుంది...
సమాజం వారి కళను గుర్తించకపోయినా, తమ సాంప్రదాయాలను సజీవంగా ఉంచేందుకు వాల్ముట్టి మహిళలు కృషి చేస్తున్నారు. ‘నా జీవితంలో సంగీతం ఒక భాగం. నేను సంగీతంతో పాటు పెరిగాను. నేను మ్యూజిక్ టీచర్‌గా మారి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను’’ అంటారు సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన మేఘ. ఆమె సోదరి సజినా సైతం మ్యూజిక్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె గ్రామంలో పిల్లలకు శిక్షణనిస్తున్నారు. ‘‘మ్యూజిక్ టీచర్ కావడం నా కల.
సంగీతమే ప్రపంచంగా ఉన్న వాతావరణంలో పెరగడం వల్ల ఆత్మవిశ్వాసంతో ఈ కెరీర్‌ను ఎంచుకున్నాను’’ అంటారు సజినా. ఈ గ్రామంలో చాలామంది అవార్డు పొందిన గాయకులు కనిపిస్తారు. సినిమాల్లో పాటలు పాడినవారూ ఉన్నారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, తమ గ్రామాన్ని మొదటి మ్యూజిక్ విలేజ్‌గా ప్రకటించడం వాళ్లకు ఎంతో ఊరటనిచ్చింది. మొత్తానికి కొన్ని వేల ఏళ్లనాటి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్తతరం ప్రయత్నిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!
గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్
Read Latest Telangana News and National News