నెలల తరబడి గొయ్యిలోనే.. ప్రాణాల కోసం భయంకర పోరాటం.. చివరికి..
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:36 PM
నిఘా, తీవ్ర గాయాలు, కదల్లేని పరిస్థితి.. అయినా అతను వెనక్కి తగ్గలేదు. ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన కాలును తానే కోసుకున్న ఉక్రెయిన్ సైనికుడు కోస్టియాంటిన్ వ్లాసెంకో కథ ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ సైనికుడు చేసిన అసాధారణ పోరాటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 49 ఏళ్ల ఉక్రెయిన్ పదాతిదళ సైనికుడు కోస్టియాంటిన్ వ్లాసెంకో దాదాపు 500 రోజుల పాటు యుద్ధరంగంలో విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో శత్రు డ్రోన్ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దాడిలో అతని ఎడమ కాలు కోల్పోగా.. కుడి కాలు కూడా తీవ్రంగా దెబ్బతిని విరిగిపోయింది. దీంతో కనీసం పాకుతూ కదలడం కూడా అతడికి కష్టంగా మారింది. చుట్టూ శత్రు డ్రోన్ల నిఘా.. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న పరిస్థితుల్లో సాయం అందడం కూడా కష్టమైంది. అయినప్పటికీ బతకాలనే దృఢ సంకల్పంతో వ్లాసెంకో పోరాటం కొనసాగించాడు.
తీవ్ర గాయాలతో కదల్లేని స్థితిలో ఉన్న వ్లాసెంకో.. ప్రాణాలను కాపాడుకోవడానికి చివరకు అత్యంత బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాడు. గాయపడిన కుడి కాలుతో ముందుకు సాగలేని పరిస్థితి ఎదురుకావడంతో.. సుమారు మూడు నెలల తర్వాత తన కాలును తానే కోసుకున్నాడు. అనంతరం రక్తస్రావాన్ని నియంత్రించేందుకు టోర్నికేట్ కట్టుకున్నాడు. ఓ పాఠశాల భవనంలోని బాయిలర్ కింద ఉన్న ఇరుకైన గొయ్యిలో తలదాచుకుంటూ నెలల తరబడి కాలం గడిపాడు. అలా దాదాపు ఎనిమిది నెలల పాటు శిథిలాల్లోనే ఆశ్రయం పొందిన అతడు.. తీవ్ర నొప్పిని భరిస్తూ, ప్రాణాలపై ఆశను నిలుపుకునేందుకు ప్రయత్నించాడు.
చివరకు అక్టోబర్ 4న ఉక్రెయిన్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌తో వ్లాసెంకోకు విముక్తి లభించింది. వైమానిక డ్రోన్ ద్వారా సైనికుడిని యుద్ధభూమి నుంచి తరలించడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ కమాండర్లు పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది.
అనంతరం ఖార్కివ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్లాసెంకో తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘నేను అప్పటికే నన్ను నేను పాతిపెట్టుకున్నాను. ఇక ఏ ఆశా మిగల్లేదని నాకు తెలుసు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. మృత్యువు అంచుల వరకు వెళ్లి, నెలల తరబడి పోరాడి, చివరకు ప్రాణాలతో బయటపడిన అతడి కథ యుద్ధభూమిలో మానవ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి..
బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం
స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Read Latest AP News And Telugu News