తుపానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:40 PM
ట్యునీషియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులతో ప్రయాణికులను హడలెత్తించింది. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుదుపులకు గురికావడం, విమానం కింద పడిపోతున్నట్లు అనిపించడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.
న్యూఢిల్లీ: ట్యునీషియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులతో ప్రయాణికులను హడలెత్తించింది. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కుదుపులకు గురికావడం, కింద పడిపోతున్నట్లు అనిపించడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. చివరకు విమానాన్ని మరో ఎయిర్‌పోర్టుకు మళ్లించి సురక్షితంగా దించడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియా రాజధాని టునిస్‌కు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం TK 661లో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియోను మైస్కాయా అనే ప్రయాణికురాలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్తాంబుల్ నుంచి బయలుదేరిన తర్వాత విమాన ప్రయాణం సాధారణంగానే సాగింది. అయితే టునిస్-కార్తేజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నించినప్పటి నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పైలట్ ల్యాండింగ్‌కు మూడు సార్లు ప్రయత్నించినట్లు ఆమె పేర్కొంది. ప్రతిసారీ విమానం తుపాను ప్రాంతం మీదుగా వెళ్లడంతో తీవ్ర కుదుపులకు గురైందని తెలిపింది. ‘మూడోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా కిందకు పడిపోతున్నట్లుగా అనిపించింది. నా జీవితంలో ప్రాణాల కోసం నేను ఎప్పుడూ అలా భయపడలేదు. ఆ సమయంలో నాతో పాటు అమ్మ కూడా ఉంది’ అని మైస్కాయా వెల్లడించింది.
పైలట్ నాలుగోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే పరిస్థితి కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని మైస్కాయా తెలిపింది. దీంతో ‘మరో దేశానికి వెళ్లండి.. వేరే విమానాశ్రయంలో దించండి’ అంటూ ప్రయాణికులు కేకలు వేసినట్లు చెప్పింది. చివరకు విమానాన్ని టునిస్-కార్తేజ్ విమానాశ్రయానికి సుమారు 60 మైళ్ల దూరంలో ఉన్న ఎన్‌ఫిధా-హమ్మమెట్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు మళ్లించారని పేర్కొంది. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ‘మేమంతా సురక్షితంగా బయటపడ్డాం. బహుశా టర్కిష్ ఎయిర్‌లైన్స్ పైలట్ల నైపుణ్యం వల్లే ఇది సాధ్యమైంది’ అని మైస్కాయా హర్షం వ్యక్తం చేసింది. కాగా, టునిస్-కార్తేజ్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రతికూల వాతావరణం నెలకొంది. తీవ్ర గాలులు, టర్బులెన్స్ కారణంగా విమానం భారీగా కుదుపులకు గురైంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఇసుకతిన్నెలపై అక్షరాల ఓనమాలు.. మహిళలు దిద్దుతున్న సంతకాలు
స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఎద్దు.. క్షణాల్లో షాకింగ్ సీన్ వీడియో వైరల్