Share News

సూర్యుడు లేకుండా 4 నెలలు.. అక్కడ మనుషుల బ్రతుకెలా సాగుతుందో తెలుసా?

ABN , Publish Date - Jan 25 , 2026 | 10:05 AM

ప్రతీ ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 4 నెలల పాటు అక్కడ సూర్యుడు కనిపించడు. దట్టమైన మంచులో వెలుగన్నది లేకుండా చీకటి మాత్రమే తాండవిస్తుందక్కడ. ఎక్కడిదీ ప్రాంతం.. అక్కడి జనం జీవితాలెలా? ఎందుకంత ఆనందంగా దీనిని అధిగమిస్తున్నారు?

సూర్యుడు లేకుండా 4 నెలలు.. అక్కడ మనుషుల బ్రతుకెలా సాగుతుందో తెలుసా?
Svalbard Polar Night

ఆంధ్రజ్యోతి, జనవరి 25: నార్వేకు చెందిన స్వాల్‌బార్డ్ (Svalbard) అంటే అర్కిటిక్ సముద్రంలో ఉన్న ఒక దూరపు ద్వీపసమూహం. ఇక్కడి ప్రధాన నగరం లాంగ్‌యియర్‌బయెన్ (Longyearbyen) ప్రపంచంలోనే అత్యంత ఉత్తర భాగంలో ఉన్న నివాస ప్రాంతం ఇది. ఇక్కడ సుమారు 2,500 మంది (వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, మైనింగ్ కార్మికులు) జీవిస్తున్నారు. ఇక్కడ మనుషుల కంటే ధ్రువ ఎలుగుబంట్లు (పోలార్ బేర్స్) ఎక్కువగా ఉంటాయి.

Svalbard-Polar-Night-5.jpg


4 నెలల పోలార్ నైట్ ఏమిటి?

నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సుమారు 120 రోజులు (4 నెలలు) సూర్యుడు హారిజాన్ పైకి రాడు. దాదాపు 3,000 గంటల పాటు వెలుగు లేకుండా చీకటి మాత్రమే ఉంటుందక్కడ. ఈ సమయంలో రాత్రి, పగలు అనే తేడా ఉండదు. కేవలం గడియారాలే రోజును నిర్ణయిస్తాయి. చుట్టూ నక్షత్రాలు, ఆకాశంలో ఎప్పుడైనా (ఉదయం 10 గంటలకో, రాత్రి 2 గంటలకో) అద్భుతమైన నార్తర్న్ లైట్స్ (చుక్కలు) కనిపిస్తాయి. ఇవి చీకటిని ఒక మాయలాగ మారుస్తాయి.

Svalbard-Polar-Night-3.jpg


చీకటితో అక్కడి జనం ఎలా పోరాడుతారు?

కోసెలిగ్ (Koselig) అనే నార్వేజియన్ తత్వశాస్త్రం ప్రకారం.. ఇక్కడ 'సుఖం, ఆనందం, వెచ్చదనం' అనే భావనతో రోజు గడుస్తుంది. రోజంతా ఇంట్లో మంటలు వెలిగిస్తారు. వెచ్చని కాఫీ, ఉన్ని బ్లాంకెట్లు, స్నేహితులతో సమయం గడుపుతారు. చీకటిని శాపంగా కాకుండా పండుగలా జరుపుకుంటారు.

Svalbard-Polar-Night.jpg

సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) కాపాడుకోవడానికి విటమిన్ D టాబ్లెట్లు, స్పెషల్ లైట్ థెరపీ ల్యాంపులు పెట్టుకుంటారు. ఇంట్లో బోర్డ్ గేమ్స్, సంగీతం, కథలు చెప్పుకోవడం, కమ్యూనిటీ డిన్నర్లు ఏర్పాటు చేసుకుని ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించుకుంటారు. స్నోమొబైల్స్‌(మంచు మీద ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మోటారు వాహనం)పై బయటకు వెళ్లి నార్తర్న్ లైట్స్ చూడటం, పోలార్ జాజ్ ఫెస్టివల్స్ వంటివి కూడా నిర్వహిస్తారు.

Svalbard-Polar-Night-2.jpg


ప్రత్యేక సంప్రదాయాలు, భద్రత:

ఫిబ్రవరి చివరలో మొదటి సూర్యకిరణం అక్కడున్న ఒక పాత హాస్పిటల్ మెట్లపై పడినప్పుడు 'సోల్‌ఫెస్టుకా' (Solfestuka) జరుపుకుంటారు. ఇది చాలా భావోద్వేగ సందర్భం. వారాల తరబడి ఆ క్షణం కోసం అక్కడిజనం ఎదురుచూస్తారు.

Svalbard-Polar-Night-4.jpg

భద్రత కోసం ఎల్లప్పుడూ హెడ్‌లైట్లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరిస్తారు. పోలార్ బేర్స్ నుంచి రక్షించుకోడానికి తుపాకులు (రైఫిల్స్) వెంట తీసుకెళ్తారు. చీకటిలో ఒకరినొకరు 'హలో' అని పలకరించుకుంటారు. ఇది ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.


మానసిక ఆరోగ్యం, ప్రభావాలు:

చిరకాల చీకటి కారణంగా చిరాకు, డిప్రెషన్ వంటివి రావచ్చు. కానీ కమ్యూనిటీ బాండింగ్, కోసెలిగ్ మైండ్‌సెట్, లైట్ థెరపీతో వీటిని అధిగమిస్తారు. ఇక్కడి జీవితం బయటి ప్రపంచం భయపడేంతగా కాకుండా, ఆందోళనలకు భిన్నంగా, స్వయంగా సంతోష పరిస్థితులను సృష్టించుకోవచ్చని నిరూపిస్తుంది.

Svalbard-Polar-Night-6.jpg


ఈ ద్వీపంలో చీకటి ఒక సవాలు కాదు. అది ఆనందం, స్నేహం, వెచ్చదనంను పెంచే ఒక అవకాశంగా అక్కడి జనం భావిస్తారు. సూర్యుడు తిరిగి వచ్చినప్పుడు ఆనందం ఊపిరి సలపని స్థాయికి చేరుతుంది! ఇలాంటి ప్రత్యేక జీవితం గురించి తెలుసుకోవడం వల్ల మనకు సూర్యోదయం ఎంత విలువైనదో చెబుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

చిల్లర పనులకు రాలేదు

అమరావతిని అడ్డుకోలేరు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2026 | 11:23 AM