ఏక్ నిరంజన్!
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:46 AM
నగరంలోని ఓ కేఫ్. ఓ యువతి ఒంటరిగా కూర్చుంది. ఎదురుగా కాఫీ కప్పు, చేతిలో పుస్తకం. పక్క టేబుళ్ల వద్ద స్నేహితుల గుంపులు కబుర్లలో మునిగిపోయి ఉన్నాయి.
నగర యువతలో సోలో డేట్, సోలో డైనింగ్ క్రేజ్
స్నేహితుల కోసం ఎదురు చూపుల్లేవు.. నచ్చిన చోటుకు ఒక్కరే
ఒంటరిగా వచ్చేవారికి రెస్టారెంట్‌లో ప్రత్యేక సీటింగ్
సోలో ట్రావెల్‌తో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం
హైదరాబాద్ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓ కేఫ్. ఓ యువతి ఒంటరిగా కూర్చుంది. ఎదురుగా కాఫీ కప్పు, చేతిలో పుస్తకం. పక్క టేబుళ్ల వద్ద స్నేహితుల గుంపులు కబుర్లలో మునిగిపోయి ఉన్నాయి. ఆమెకు మాత్రం ఎవరి తోడూ అవసరం లేదు. నచ్చిన చోటుకు వచ్చి, నచ్చింది ఆర్డర్ చేసి, నచ్చినంతసేపు గడుపుతోంది. ఎవరేమనుకుంటారోనన్న భయం లేదు. ఇది ఒంటరితనంతో చేసుకుంటున్న రాజీ కాదు. తమతో తాము గడపడానికి ఇష్టపడుతున్న కొత్త తరం జీవనశైలి. స్నేహితులు దొరికితే వారితో వెళ్లడం, కుదరకపోతే ఒంటరిగా వెళ్లడం.. ఇదీ నేటి యువత ఆలోచన.
స్నేహితులు బిజీ.. సోలోగా హ్యాపీ!
ఆదివారం బయటకు వెళ్లాలని స్నేహితులకు ఫోన్ చేస్తే ఒకరికి పని, మరొకరికి కుటుంబ కార్యక్రమం. గతంలో అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఇప్పుడలా కాదు. నచ్చిన డ్రెస్ వేసుకుని కేఫ్‌లో కాఫీ, ఆ తర్వాత షాపింగ్, వీలైతే సినిమా. ఇలాంటి ‘సోలో డేట్’ అనుభవాలను చాలామంది సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇతరులతో సమయం గడపడం ఇష్టమేనని, అయితే తనతో తాను గడిపిన క్షణాలు మాత్రం ప్రత్యేకమైనవని నగరానికి చెందిన ఓ యువతి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. రెస్టారెంట్‌కు ఒక్కరే వెళ్లాలంటే ఒకప్పుడు సంకోచం ఉండేది.
‘ఇంకెవరైనా వస్తారా?’ అని వెయిటర్ అడిగితే మరింత ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు ఆ బాధ లేదు. ‘ఒంటరిగా వచ్చే కస్టమర్లు ఇతరుల ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా భోజనం చేసేలా ప్రత్యేక సీటింగ్ కేటాయిస్తున్నాం’ అని నగరంలోని ఓ రెస్టారెంట్ మేనేజర్ అభినవ్ చెప్పారు. ప్రతి రెండు వారాలకోసారి తనకోసం తాను బయటకు వెళ్తానని ఆదిత్య తెలిపారు. ఏం తినాలి, ఎంతసేపు కూర్చోవాలి అనే విషయాల్లో ఇతరుల అభిరుచులకు తగ్గట్టుగా ఉండాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.
భయాన్ని దాటితే.. కొత్త ప్రపంచమే!
సోలో డేట్స్ అమ్మాయిలకే పరిమితం కాదు. ‘మొదట్లో స్నేహితులతో కలిసి బార్‌కు వెళ్లేవాడిని. ఇప్పుడు ఎక్కువగా ఒంటరిగానే వెళ్తున్నాను. అక్కడి సిబ్బందికి, వచ్చే కొందరికీ నేను పరిచయమే. అందుకే అక్కడ ఒంటరిగా ఉన్న భావన కలగదు’ అని నగరానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి చెబుతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత బాధ్యతల మధ్య కొంత సమయం తమకోసం కావాలనుకునే యువతకు ఇలాంటి అలవాట్లు విరామంలా మారుతున్నాయి. సోలో ట్రావెల్ మరింత ఆసక్తికరమైన అనుభవం.
కొత్త ప్రదేశం, తెలియని భాష, కొత్త మనుషుల మధ్య ఎవరి తోడూ లేకుండా ప్రయాణించాలి. మొదట్లో భయంగా అనిపించినా క్రమంగా తమపై తమకు నమ్మకం పెరుగుతుందని పలువురు యువతులు చెబుతున్నారు. స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోగా, వారిలో కొందరు రద్దు చేసుకోవడంతో ఒంటరిగానే వెళ్లాల్సి వచ్చిందని ఇంజినీరింగ్ విద్యార్థిని అవంతిక తెలిపారు. తొలిసారి విమానం ఎక్కి వారం రోజులు కేరళ వెళ్ళొచ్చారు. టికెట్లు బుక్ చేశాక కూడా భయంతో ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నానని, ఇప్పుడు ఒంటరిగానే మరిన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. అయితే రాత్రివేళల్లో తెలియని ప్రాంతాల్లో ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
ఏకాంతం వేరు.. ఒంటరితనం వేరు
ఒంటరిగా బయటకు వెళ్లేవారంతా సమాజానికి దూరమవుతున్నట్టు కాదు. స్నేహితులు, కుటుంబంతో గడపడం వారికీ ఇష్టమే. ప్రతి చిన్న ఆనందానికీ మరొకరి సమయం, అంగీకారం అవసరం లేదన్నదే వారి భావన. అయితే ఒంటరిగా ఉండాలనిపించడం, ఒంటరితనంతో బాధపడటం ఒకటి కాదని సైకాలజిస్ట్ కుమార్ పేర్కొన్నారు. స్వయంగా ఎంచుకున్న ఏకాంతం మానసిక శక్తిని పునరుత్తేజం చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని చెప్పారు. భయం, ఆందోళన, సమాజం పట్ల విరక్తి వల్ల వచ్చే ఏకాంతం ‘సోషల్ విత్‌డ్రాయల్’గా మారి, శూన్యతను, నిరాశను మిగుల్చుతుందని హెచ్చరించారు. మనుషులను కలవాలంటేనే భయం కలిగి, రోజువారీ జీవితంపై ప్రభావం పడుతుంటే ఆ అలవాటు ఆరోగ్యకరం కాదని గుర్తించాలన్నారు.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి