షాక్ ఇచ్చిన బర్త్‌డే కేక్.. బాలుడి కడుపును స్కానింగ్ చేసి చూడగా..
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:26 AM
పిల్లల పుట్టినరోజు వస్తోందంటే చాలు తల్లిదండ్రులు ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. డెకరేషన్, బంధువుల ఆహ్వానాలు, పిల్లలకు నచ్చే థీమ్ కేక్‌ల ఆర్డర్లతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల పుట్టినరోజు వస్తోందంటే చాలు తల్లిదండ్రులు ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. డెకరేషన్, బంధువుల ఆహ్వానాలు, పిల్లలకు నచ్చే థీమ్ కేక్‌ల ఆర్డర్లతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే, మనం ఎంతో ఇష్టంగా తెచ్చే బర్త్‌డే కేక్ ఒక్కోసారి మన పిల్లల ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశం ఉందని నిరూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని ఠాణెలో మూడేళ్ల రేయాన్ష్ అనే చిన్నారి పుట్టిన రోజు.. ఆ తల్లిదండ్రులకు జీవితంలో మర్చిపోలేని పీడకలగా మారింది. సదరు బాలుడు ఎంతో సంతోషంతో కేక్ కట్ చేశాడు. తర్వాత కేక్ ముక్కను తినేశాడు. అయితే అప్పటికే ఆ కేక్‌లో ఉన్న రెండు పిన్నులను గమనించకుండా మింగేశాడు. బాలుడికి అస్వస్థతగా ఉండడంతో తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాలుడికి స్కానింగ్ తీయగా.. కడుపులో రెండు పిన్నులు కనిపించాయి. అయితే దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, కాలకృత్యాల సమయంలో బయటికి వచ్చేస్తాయని వైద్యులు తెలిపారు. ఆ మరుసటి రోజు వైద్యులు చెప్పినట్లుగానే జరగడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
రేహాన్ తల్లి మాట్లాడుతూ.. ‘ రేయాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తనకు ఇష్టమైన ‘బౌలింగ్ థీమ్’తో కూడిన కేక్‌ను ఆర్డర్ చేశాం. దానిపై బంగారు రంగులో పిన్స్ అమర్చారు. ఆ పిన్నులకు లోపలవైపు ఆధారంగా లోహపు తీగలను అమర్చారు. ఆ విషయం మాకు తెలియదు.. కనీసం బేకరీ వాళ్లు కూడా చెప్పలేదు. ఈ తప్పు ఆరోజు మాకు కాళరాత్రిగా మిగిలిపోయింది. డెకరేషన్ చేసే కేకుల విషయంలో ఇలాంటివి ఉంటాయని బేకరీ వాళ్లు ముందే చెప్పాలి. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి.’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
అదృష్టమంటే ఈమెదే.. భారీ ఈదురుగాలుల సమయంలో ఏమైందో చూడండి..