Share News

Sankranti: గాలిపటాలు ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ABN , Publish Date - Jan 11 , 2026 | 08:50 PM

సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కడ చూసినా పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈ మధ్య కొంతమంది వాడుతున్న మాంజా వల్ల పక్షులు, జంతువులకు మాత్రమే కాదు.. మనుషుల ప్రాణాలకూ పెను ముప్పు వాటిల్లుతోంది.

Sankranti: గాలిపటాలు ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Sankranti Kite Flying Manjha dangers

‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా’ అనే పాట గుర్తుంది కదూ.! సంక్రాంతి అంటేనే సరదాలు సంబరాలు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకుని ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు. ముగ్గులు, కోడి పందేలు, పిండి వంటలు, భోగి మంటలు.. వీటన్నింటితో పాటు స్పెషల్ ఏటంటే పతంగులు ఎగురవేయడం. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని అంటారు. పెద్ద వాళ్లు సైతం చిన్నపిల్లల్లా సరదాగా గాలిపటాలు ఎగురవేస్తారు. పతంగుల కోలాహలంతో సుమారు వారం రోజుల పాటు ఆకాశమంతా రంగుల హరివిల్లుగా మారిపోతుంది. ఒకప్పటి సంగతేమో గానీ.. ఇటీవల సంక్రాంతి అంటే జనాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం పతంగుల కోసం వాడే మాంజా. దీనివల్ల పక్షులు, జంతువులతో పాటు మనుషులకూ ప్రమాదం పొంచి ఉంది. పతంగులు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.


నిషేధిత మాంజాలు వద్దు..

నైలాన్ లేదా సింథటిక్‌తో తయారైన మాంజాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. వీటితో రూపొందించిన మాంజా చాాలా దృఢంగా ఉంటుంది, దాదాపు తెగదు. ఇది పక్షుల రెక్కలకు తగలడంతో అవి చనిపోతున్నాయి. మనుషులకూ ఇవి ప్రమాదకరంగా మారాయి. పతంగుల కోసం కేవలం కాటన్(నూలు) దారాలనే వాడాలి. ప్రభుత్వాలు వీటిపై అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది అదేపనిగా చైనా మాంజాను వాడుతున్నారు. ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లే వారికి ఈ మాంజాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. తెగిపోయిన గాలిపటాల దారం గాల్లో తేలుతూ ఉంటుంది. అది కనిపించక.. బైక్‌పై వెళ్లేవారు అకస్మాత్తుగా తగిలి తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఈ మాంజాల వల్ల ముఖం, గొంతు భాగాలకు తీవ్ర ప్రమాదం పొంచిఉంది. అందుకే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, స్కార్ఫ్ వంటి వాటితో ముఖాన్ని కవర్ చేసుకోవడం శ్రేయస్కరం.

kitht.jpg


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • బైక్ నడిపేవారు తప్పనిసరిగా మెడకు మందపాటి స్కార్ఫ్ లేదా మఫ్లర్ చుట్టుకోవాలి. వీలైతే బైక్‌కు ముందు భాగంలో ‘U’ ఆకారపు ఇనుప తీగను అమర్చుకుంటే మంచింది. అది రక్షణ కవచంగా పనిచేస్తుంది. మాంజా దారం కంటికి కనిపించదు, అందుకే ఫ్లైఓవర్లపై నెమ్మదిగా వెళ్లడం ఉత్తమం. లేకపోతే శరీర భాగాలను ఇట్టే కోసేయగలవు.

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు వేళ్లకు ప్లాస్టిక్ గ్లౌజులు వంటివి చుట్టుకోవాలి. ఫలితంగా.. మాంజా వల్ల చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా మాంజావల్ల రక్తస్రావమైతే గాయాన్ని శుభ్రంగా కడగాలి. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. తెగిపోయిన పతంగుల కోసం రోడ్ల మీదకు పరిగెత్తవద్దని పిల్లలకు చెప్పండి.

  • సాధ్యమైనంత వరకు గాలిపటాలను విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, రేడియో, టీవీ సిగ్నల్ ఏరియాలు, సెల్‌ఫోన్ టవర్స్‌కు దూరంగా ఎగురవేయాలి. మిద్దెలు, ఎత్తైన భవనాలపై ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు కిందివైపు గమనిస్తూ ఉండాలి. ఒకవేళ పిల్లలు మేడపై పతంగులు ఎగురవేయాలని చూస్తే.. పెద్దవాళ్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

  • విద్యుత్ తీగలకు చుట్టుకున్న గాలిపటాలను తొలగించే ప్రయత్నంలోనూ విద్యుదాఘాతానికి గురైన సంఘటనలు జరిగే అవకాశముంది. చెట్లు, వైర్లకు పతంగులు చిక్కుకుపోతే.. వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి.


ఇవీ చదవండి:

మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం

అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో..

Updated Date - Jan 12 , 2026 | 09:21 AM