Share News

9 టు 5 ఉద్యోగం చేయలేక ఆరుసార్లు కెరీర్ మార్చుకుంది.. రాజస్థాన్ మహిళ కథ వైరల్..

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:34 PM

జీవితంలో స్థిరపడాలంటే మంచి ఉద్యోగం, నెలనెలా జీతం, పెళ్లి, కుటుంబం.. ఇవే అవసరమని చాలామంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం తమకు నచ్చిన విధంగా జీవించేందుకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటారు.

9 టు 5 ఉద్యోగం చేయలేక ఆరుసార్లు కెరీర్ మార్చుకుంది.. రాజస్థాన్ మహిళ కథ వైరల్..
Himani Mittal

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో స్థిరపడాలంటే మంచి ఉద్యోగం, నెలనెలా జీతం, పెళ్లి, కుటుంబం.. ఇవే అవసరమని చాలామంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం తమకు నచ్చిన విధంగా జీవించేందుకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటారు. తమకు నచ్చిన పనే చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల హిమానీ మిట్టల్ (Himani Mittal) కూడా అలాంటి వారిలో ఒకరు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఉద్యోగం చేయడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఆమె ఇప్పటివరకు ఆరు సార్లు కెరీర్ మార్చుకుని తనకు నచ్చిన రీతిలో ముందుకు సాగుతున్నారు.


రాజస్థాన్‌లోని అబూ రోడ్‌కు చెందిన హిమానీ మిట్టల్ చిన్న వయసులోనే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం ఎంత ముఖ్యమో గుర్తించారు. ఈ లక్ష్యంతోనే 21 ఏళ్ల వయసులో స్పానిష్ భాష బోధించడం ప్రారంభించారు. అప్పటికి ఆమె ఆ భాషను నేర్చుకుంటున్నప్పటికీ, బోధన ద్వారా ఆదాయం సంపాదించే ప్రయత్నం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆమె వయసు 23 ఏళ్లు. ఆ సమయంలో తన పనిని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చుకున్నారు. దీంతో ఇంటి నుంచే పని చేస్తూ కొత్త అవకాశాలను అన్వేషించే వీలు కలిగింది. చిత్ర నిర్మాణంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత 25 ఏళ్ల వయసులో హిమానీ స్పెయిన్‌కు వెళ్లారు (Rajasthan Woman Viral Story).


స్పెయిన్‌లో హిమానీ ఇంగ్లిష్ బోధిస్తూ మూడేళ్లపాటు నివసించారు. ఈ సమయంలో యూరప్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వివిధ దేశాలకు చెందిన వ్యక్తులను కలుసుకున్నారు. విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా హిమానీ తనకు నచ్చిన జీవనశైలినే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. హిమానీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో 'ఎస్‌ఎఫ్ ఛాలెంజ్' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లకు చేరుకుంటున్నవారు లేదా ఆ వయసులో ఉన్నవారు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సందేహాల గురించి ఇందులో చర్చిస్తున్నారు (Career Change).


కెరీర్‌ను మార్చుకోవాలనుకునేవారు, కొత్త అవకాశాలను అన్వేషించాలనుకునేవారు, తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకునేవారికి తన అనుభవాలు ఉపయోగపడతాయని హిమానీ భావిస్తున్నారు (Viral Instagram Story). జీవితంలో విజయం సాధించడానికి, పెళ్లి చేసుకోవడానికి లేదా స్థిరపడటానికి ఒకే వయసు అంటూ ఏమీ లేదన్నది ఆమె సందేశం. హిమానీ తన ప్రయాణాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోకు పలువురు స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దగ్గరపడింది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..


మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 22 , 2026 | 01:45 PM