Share News

టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. వేగంగా దూసుకెళ్లి..

ABN , Publish Date - May 12 , 2026 | 05:15 PM

పాకిస్థాన్‌లో కొంత మంది పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది. గమ్యస్థానానికి చేరుకునే కొన్ని నిమిషాల ముందే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకెళ్లిన బస్సు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా బోల్తా పడింది.

టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. వేగంగా దూసుకెళ్లి..
Tourist Bus Accident

కరాచీ: పాకిస్థాన్‌లో కొంత మంది పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది. గమ్యస్థానానికి చేరుకునే కొన్ని నిమిషాల ముందే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకెళ్లిన బస్సు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయానక ప్రమాద దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


సింధ్ ప్రావిన్సులోని కీంఝర్ సరస్సు అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రదేశం. సరస్సు ప్రాంతాన్ని చూసేందుకు నిత్యం అనేక మంది వెళ్తుంటారు. ముఖ్యంగా వారాంతాల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే, గత ఆదివారం నాడు కరాచీ నుంచి కీంఝర్ సరస్సు వైపునకు పర్యాటకులతో కూడిన బస్సు వెళ్తోంది. లోపల చోటు లేకపోవడంతో చాలా మంది బస్సు టాప్‌పై కూర్చొన్నారు. అతివేగంగా దూసుకెళ్లిన బస్సు.. కీంఝర్ సరస్సు సమీపంలోని ఛాతో చంద్ వద్దకు రాగానే కరాచీ-థట్టా జాతీయ రహదారిపై ఒక్కసారిగా బోల్తా పడింది. అనంతరం కొన్ని మీటర్ల దూరం వరకు దూసుకెళ్లింది.


ఈ ప్రమాదంలో 20 మందికి పైగా పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. అలాగే తల సహా పలు శరీర భాగాలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను థట్టా, కరాచీలోని పలు ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని అనుమానిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..

నడిరోడ్డుపై ఖడ్గ మృగాల భీకర పోరు.. బెంబేలెత్తిన జనం..

Updated Date - May 12 , 2026 | 05:27 PM