పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..
ABN , Publish Date - May 12 , 2026 | 03:58 PM
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం లక్కీ మార్వాత్‌లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. ఉగ్రవాదులు ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి సుమారు 9 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్: అఫ్గానిస్థాన్ సరిహద్దు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం లక్కీ మార్వాత్‌లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. మార్కెట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి సుమారు 9 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఓ మహిళ ఉన్నారు. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత వహించలేదు.

అయితే, పోలీసులు మాత్రం తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కి చెందిన తాలిబాన్లే ఈ దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. టీటీపీ అనేది అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం నుంచి కొన్నేళ్ల కిందట వేరు పడింది. అయినప్పటికీ ఆ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని పాకిస్థాన్ భద్రతా దళాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. తాజా దాడి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పెరుగుతున్న హింసకు మరో నిదర్శనంగా మిగిలింది.
మరోవైపు బన్నూ జిల్లాలో భద్రతా పోస్టుపై ఈనెల 10వ తేదీన ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం పోలీస్ పోస్టుపైకి దూసుకెళ్లింది. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో వాహనం పేలిపోయింది. పేలుడు ధాటికి పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టం కాగా.. స్థానికంగా ఉన్న అనేక ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. పలువురు భద్రతా సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

అనంతరం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో మెుత్తం 15 మంది భద్రతా సిబ్బంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ దాడికి టీటీపీయే కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఈ ఘటన జరిగిన రెండు, మూడు రోజుల వ్యవధిలోనే మరో పేలుడు ఘటన కలకలం సృష్టిస్తోంది. కాగా, ఫిబ్రవరి నెలాఖరు నుంచి పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఐరన్‌డోమ్ బ్యాటరీని ధ్వంసం చేశాం: హెజ్బొల్లా
వెంటిలేటర్‌పై ‘కాల్పుల విరమణ’: ట్రంప్