పులితో టిక్‌టాక్ వీడియో.. యువకుడి ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్ పిచ్చి..
ABN , Publish Date - Nov 13 , 2026 | 08:49 AM
లైక్స్, వ్యూస్ కోసం చేసే పిచ్చి పనులు ఒక్కోసారి ఎంతటి విషాదానికైనా దారితీయొచ్చు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పని చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: లైక్స్, వ్యూస్ కోసం చేసే పిచ్చి పనులు ఒక్కోసారి ఎంతటి విషాదానికైనా దారితీయొచ్చు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పని చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కెమెరా ముందు క్రూరమృగంతో వీడియో తీసి వైరల్ కావాలనుకున్నాడు ఆ ఇన్ఫ్లుయెన్సర్. అయితే, తన కోరిక మరో యువకుడి ప్రాణాలను తీస్తుందని మాత్రం ఊహించలేకపోయాడు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ భయానక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన టిక్‌టాకర్ నోమన్ హసన్ పులితో టిక్‌టాక్ వీడియో తీసి వైరల్ కావాలని అనుకున్నాడు. ఇటీవల కహ్నా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ వన్యప్రాణుల పెంపకం కేంద్రానికి వెళ్లాడు. అక్కడి ఫామ్‌హౌస్‌లో పులితో టిక్‌టాక్ వీడియో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బోనులో ఉన్న పులిని సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అయితే, అక్కడే పనిచేస్తున్న తల్హాను కూడా వీడియోలో పాల్గొనాలని హసన్ కోరాడు. పులి వద్దకు తల్హా వెళ్లగానే ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని టిక్‌టాకర్ నోమన్ హసన్ తన కారులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అయితే, గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ తల్హా ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో పులి దాడి విషయాన్ని దాచేందుకు నిందితులు ప్రయత్నించినట్లు గుర్తించారు. తొలుత యువకుడిని ఆసుపత్రికి తరలించినప్పుడు కుక్క దాడి చేసిందని వైద్యులకు అబద్ధం చెప్పినట్లు తెలిపారు. అయితే, గాయాలను పరిశీలించిన వైద్యులు పులి దాడిగా నిర్ధారించినట్లు వెల్లడించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఫామ్‌హౌస్ యజమాని ఫయ్యాజ్ అలియాస్ ఫైజీతో పాటు టిక్‌టాకర్ నోమన్ హసన్‌ను అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..
ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన