గ్రేటర్ నోయిడాలో అగ్ని ప్రమాదం.. ఫ్లాట్‌లోకి దూరి మంటలార్పిన బాలుడు.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:57 PM
అగ్నిప్రమాదం జరిగితే చాలామంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు. మరికొందరు సహాయం కోసం ఎదురుచూస్తారు. కానీ గ్రేటర్ నోయిడాలో ఓ 16 ఏళ్ల బాలుడు మాత్రం అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 2, 11వ అవెన్యూలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తాతగారి స్కూటర్‌ను తీసుకురావడానికి వెళ్లిన 16 ఏళ్ల విద్యార్థి ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగడాన్ని గమనించాడు.
వెంటనే భవనంలోని భద్రతా సిబ్బందికి.. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. అయితే.. సహాయం వచ్చే వరకు వేచి చూడకుండా సమీపంలోని అగ్నిమాపక పరికరాన్ని తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. మంటలు మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించిన బాలుడు.. పక్కింటి బాల్కనీ నుంచి ఓ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకుని మంటలు వ్యాపించిన ఫ్లాట్ వద్దకు వెళ్లాడు. ఆ ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటంతో అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం లోపలి నుంచి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు.
బాలుడి సమయస్ఫూర్తితో.. మంటలు ఇంట్లో ఉన్న పుస్తకాల వ్యాపించకముందే అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను హేమ్‌వంత్ తివారీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బాలుడు అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దట్టమైన పొగలు వెలువడుతున్నప్పటికీ అతడు వెనక్కి తగ్గకుండా చొరవ చూపినట్లు వీడియోలో పేర్కొన్నారు. తాతగారి స్కూటర్‌ను తీసుకురావడానికి వెళ్లిన బాలుడికి అనుకోకుండా ఈ ప్రమాదం ఎదురవగా.. అతడి అప్రమత్తతతో పెద్ద నష్టం తప్పింది. దీంతో నెటిజన్లు బాలుడి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు
ఫరీదాబాద్ కాల్పుల కేసు.. బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్