Share News

స్మారక చిహ్నం ముద్దులమయం!

ABN , Publish Date - Mar 01 , 2026 | 10:38 AM

‘ఒక ముద్దు మనిషి జీవితాన్ని నాశనం చేయవచ్చు’ ... ప్రసిద్ధ ఐరిష్‌ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన ఒక కవితలోని పంక్తి ఇది. అలాంటి ముద్దు ఆయన స్మారక చిహ్నాన్నే దెబ్బతీస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.

స్మారక చిహ్నం ముద్దులమయం!

‘ఒక ముద్దు మనిషి జీవితాన్ని నాశనం చేయవచ్చు’ ... ప్రసిద్ధ ఐరిష్‌ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన ఒక కవితలోని పంక్తి ఇది. అలాంటి ముద్దు ఆయన స్మారక చిహ్నాన్నే దెబ్బతీస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.

ప్యారిస్‌లో ఉన్న ఆస్కార్‌ వైల్డ్‌ స్మారక చిహ్నాన్ని సందర్శించే మహిళా అభిమానులు ఆయనపై అభిమానం, ప్రేమతో ముద్దులు కురిపిస్తున్నారు. ఫలితంగా లిప్‌స్టిక్‌ గుర్తులతో ఈ రొమాంటిక్‌ రైటర్‌ స్మారక చిహ్నం నిండి పోయింది. జరిమానా విధిస్తామని హెచ్చ రించినా... ఎవరూ వినకపోవడంతో స్మారక చిహ్నం చుట్టూ అద్దాలు బిగించాల్సి వచ్చింది.


book5.jpgఅభిమానం ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటుంది. కొన్ని చోట్ల పూల వర్షం కురిపిస్తే, మరికొన్ని చోట్ల దండలతో ముంచెత్తుతారు. ఐరిష్‌ రచయిత స్మారక చిహ్నం దగ్గర మాత్రం ముద్దులతో అభిమానం కురిపిస్తారు. 19వ శతాబ్దానికి చెందిన ఆస్కార్‌ వైల్డ్‌ స్మారక చిహ్నం ప్యారిస్‌లో ఉంది. 20 టన్నుల రాయిని స్మారక చిహ్నంగా మలిచిన తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. రెక్కలతో ఎగురుతున్న ఫీనిక్స్‌ను పోలినట్టుగా బొమ్మ చెక్కి ఉంటుంది. బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్న ఆస్సిరియన్‌ బొమ్మల స్ఫూర్తితో, ఆస్కార్‌ వైల్డ్‌ రాసిన ‘ది ఫీనిక్స్‌’ ఆధారంగా ఈ బొమ్మను రూపొందించారు.


అభిమానుల అత్యుత్సాహం

ప్యారిస్‌లోని అతి పెద్ద శ్మశానవాటిక ‘పెరెలాచైస్‌’లో ఆస్కార్‌ వైల్డ్‌ స్మారక చిహ్నం ఉంది. తమ అభిమాన రచయిత స్మారక చిహ్నం దగ్గర నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తు తుంటారు. ఆస్కార్‌ వైల్డ్‌కు మహిళా భిమానులు ఎక్కువ. ఆయనపై అపరిమిత మైన అభిమానంతో వారంతా సమాధిని ముద్దాడుతుంటారు. దీనివల్ల లిప్‌స్టిక్‌ ముద్రలు స్మారకచిహ్నంపై స్పష్టంగా కనిపిస్తుంటాయి. ప్రతీరోజూ ఇదే తంతు. దాంతో స్మారక చిహ్నం నిండా మహిళల లిప్‌స్టిక్‌ ముద్రలే. మరికొందరు అభిమానులు ప్రేమతో కూడిన సందేశాలు రాస్తుంటారు.


book5.3.jpgజరిమానా విధించినా...

స్మారకచిహ్మాన్ని ముద్దు పెట్టుకునే సంప్రదాయం 1990లో మొదటిసారి ప్రారంభమైనట్టు అధికారులు చెబుతారు. అప్పటి నుంచి ఒకరిని చూసి మరొకరు ముద్దులు కురిపించడం ప్రారంభించారు. ఆస్కార్‌ వైల్డ్‌పై వారికున్న అభిమానం, ప్రేమను వ్యక్తీకరించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ‘‘వైల్డ్‌ చైల్డ్‌.. మిమ్మల్ని మేము గుర్తుంచుకుంటాం’’... ‘‘నక్షత్రాలను చూస్తూ ఉండండి’’... అని కొటేషన్లు రాసి తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. దీనివల్ల స్మారక చిహ్నం దెబ్బతింటోదనే ఆందోళన వ్యక్తమైంది. దాంతో అధికారులు తప్పని పరిస్థితుల్లో చర్యలు చేపట్టారు. స్మారక చిహ్నంపై ముద్దుపెడితే జరిమానా విధించడం ప్రారంభించారు. అయినా అభిమానులు భయపడలేదు.


చుట్టూ అద్దాలు...

‘స్మారక చిహ్నం దెబ్బతింటోందని, ఎవ్వరూ కూడా ముట్టుకునే ప్రయత్నం చేయవద్ద’ని విజ్ఞప్తి చేసినా సందర్శకులు పట్టించుకోలేదు. రానురాను లిప్‌స్టిక్‌ ముద్రలు జిడ్డుగా మారి శుభ్రం చేయడం కష్టంగా మారింది. నీళ్లతో కడిగినా కూడా తొలగిపోలేదు. దాంతో ఆస్కార్‌ వైల్డ్‌ 111 వర్ధంతి సందర్భంగా స్మారక చిహ్నం చుట్టూ అద్దాలు ఏర్పాటు చేశారు. సందర్శకులు ఎవ్వరూ స్మారక చిహ్నం దగ్గరకు వెళ్లి ముద్దుపెట్టే ప్రయత్నం చేయకుండా అడ్డుకోవడానికి గ్లాస్‌ బ్యారియర్‌ ఉపయోగపడింది. అయితే అభిమానులు ఇప్పుడు ఆ అద్దాలపై కూడా ముద్దులు పెడుతున్నారు. పూలను, పేపర్‌నోట్స్‌ను స్మారక చిహ్నంపైకి విసురుతున్నారు.


‘‘లిప్‌స్టిక్‌ తీవ్రమైన సమస్యగా మారింది. రాయిలోకి గ్రీజు సింక్‌ కావడం వల్ల మరకలు పోవడం లేదు’’ అని ఆస్కార్‌ వైల్డ్‌ మనవడు మెర్లిన్‌ హోలాండ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆస్కార్‌పై ఉన్న అభిమానాన్ని ఎవరూ ఆపలేరు కదా.

ఎన్నెన్నో అద్భుతమైన రచనలు చేసిన ఆస్కార్‌ వైల్డ్‌ 40 ఏళ్ల వయసులోనే మరణించారు. అయితే ఆయన రచనలకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. ఆ అభిమానమే ఆయన స్మారక చిహ్నానికి వేలాది ముద్దుల ముద్రలను వేశాయి. చివరికి అద్దాల కంచెలను ఏర్పాటుచేసేలా చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2026 | 10:38 AM