జాలరి ముఖాన్ని చుట్టేసిన ఆక్టోపస్.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 15 , 2026 | 09:05 AM
చేపల వేటకు వెళ్లిన జాలరి ముఖాన్ని ఒక ఆక్టోపస్ చుట్టేయడంతో నానా అవస్థలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: చేపల వేటకు వెళ్లిన జాలరి ముఖాన్ని ఒక ఆక్టోపస్ చుట్టేయడంతో నానా అవస్థలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిలిప్పీన్స్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరికి ఊహించని భయానక అనుభవం ఎదురైంది. పలవాన్‌లోని ప్యూర్టో ప్రిన్సెసా ద్వీపం సమీపంలో జూలై 10న జెస్సర్ సెర్వాంటెస్ చిన్న చెక్క పడవలో చేపలు పడుతుండగా, నీటి నుంచి ఓ ఆక్టోపస్‌ను బయటకు తీశాడు. అయితే అది అతని చేతిలో నుంచి ఒక్కసారిగా పైకి ఎగిరి ముఖాన్ని పట్టేసుకుంది. జాలరి ముఖాన్ని ఆక్టోపస్ గట్టిగా పట్టుకోవడంతో అతను నానా అవస్థలు పడ్డాడు. దాన్నుంచి విడిపించుకోవడం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఓ దశలో ఆక్టోపస్ అతని నోటిని కూడా కప్పేయడంతో శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ‘నేను పట్టుకున్న ఆక్టోపస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైంది. అది దాదాపు నా ముఖాన్ని చీల్చేసింది’ అని అతను తెలిపాడు.
ఆక్టోపస్ పట్టును వదలకపోవడంతో సెర్వాంటెస్ పడవలో ఉన్న వెదురు ముక్కను ఉపయోగించాడు. దానిపై పదేపదే కొడుతూ తన ముఖం నుంచి పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు. చివరకు ఆక్టోపస్ తన పట్టును వదలడంతో అతను దాన్ని తిరిగి సముద్రంలోకి విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ముంబై రైలా మజాకా.. కొరియా వ్యక్తికి చుక్కలు కనిపించాయిగా..
ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. రైలు ఎక్కుతుండగా..