మృత్యు అంచున పర్యాటకులు.. హాట్ ఎయిర్ బెలూన్‌లో ఏమైందో చూడండి..
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:42 PM
ఆకాశంలో విహరిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఒక్కసారిగా బలమైన గాలుల ధాటికి అదుపు తప్పింది. అందులో పర్యాటకులు ఉండగానే విద్యుత్ తీగల వైపు దూసుకెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో పర్యాటకులతో హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరిస్తున్న సమయంలో ఓ అనూహ్య చోటుచేసుకుంది. టర్కీకి చెందిన పైలట్ మెహమెత్ నూరి ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
బెలూన్‌లో ఉన్న పర్యాటకులు చుట్టుపక్కల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలుల కారణంగా బెలూన్ కిందకు దిగుతూ విద్యుత్ తీగల వైపు కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్ కింద ఉన్న గ్రౌండ్ సిబ్బందికి చేరుకునేలా తాడును కిందకు వదిలాడు. అయితే.. ఆ తాడు తెగిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యుత్ తీగలు సమీపంలో ఉండటంతో పర్యాటకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అయినప్పటికీ పైలట్ భయపడకుండా అందరినీ ప్రశాంతంగా ఉండాలని.. సురక్షితమైన ల్యాండింగ్‌కు సిద్ధం కావాలని సూచించాడు.
పైలట్ సమయస్ఫూర్తికి ప్రశంసలు..
పరిస్థితిని అంచనా వేసిన మెహమెత్ నూరి బెలూన్‌ను విద్యుత్ తీగలకు దూరంగా మళ్లించి సమీపంలోని వరి పొలం వైపు తీసుకెళ్లాడు. బలమైన గాలుల మధ్య ఎంతో జాగ్రత్తగా నియంత్రిస్తూ చివరకు పొలంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. బెలూన్ కొంతదూరం నేలపై కదిలినప్పటికీ అందులోని పర్యాటకులందరూ క్షేమంగా బయటపడ్డారు. తన క్యాప్షన్‌లో ఈ ఘటన సమయంలో గంటకు 11 నాట్ల వేగంతో ఉపరితల గాలులు వీచాయని.. బలమైన కిందికి లాగే గాలుల కారణంగా ల్యాండింగ్ కష్టంగా మారిందని పైలట్ వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పైలట్ ధైర్యాన్ని, అనుభవాన్ని ప్రశంసిస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ కంపెనీ యజమానిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి నూరి నైపుణ్యాన్ని కొనియాడారు.
ఇవీ చదవండి:
ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం