ముంబైలో యువజంటపై మైనర్ల దాడి.. 8 మందిపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:51 AM
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కుర్లా ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రమోద్ మహాజన్ గార్డెన్లో ఓ జంటపై కొందరు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రమోద్ మహాజన్ గార్డెన్లో ఓ జంటపై కొందరు మైనర్లు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు వారిద్దరిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో యువతి, యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నవంబర్ 20న కుర్లా వెస్ట్‌లోని ప్రమోద్ మహాజన్ గార్డెన్‌కు ఓ యువజంట వెళ్లింది. వారిద్దరూ సరదాగా పార్కులో గడుపుతుండగా.. కొంతమంది మైనర్లు వారిని చుట్టుముట్టారు. విషయం ఏంటనేది తెలియదు గానీ, వీడియో ప్రకారం ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగినట్లు కనిపిస్తోంది. అది కాస్తా తీవ్రరూపం దాల్చి దాడికి దారితీసింది. మొదటగా.. ఓ బాలుడు కర్రతో బలంగా యువకుడి తలపై దాడి చేశాడు. ఆ తర్వాత యువతినీ కర్రతో కొట్టాడు. మరో బాలుడు యువకుడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. యువతి తన స్నేహితుడిని రక్షించేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెపైనా దాడి చేస్తూ ఇద్దరినీ తీవ్రంగా హింసించారు. కర్రలు, రాళ్లతో వారిపై దాడి చేస్తూ పార్కు నుంచి బయటకు తరిమివేశారు.
అయితే, ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ముంబై పోలీసులకు ట్యాగ్ చేయడంతో ఈ విషయం వారి దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎనిమిది మంది మైనర్లను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ ఘటనలో బాధితుల వివరాలు, వారికి అయిన గాయాల తీవ్రతపై స్పష్టమైన సమాచారం తెలియరాలేదు.
కాగా, దాడికి పాల్పడిన మైనర్లపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి దాడులకు పాల్పడుతుంటే.. వారు పెద్దయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని, మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీబీఐ ఇన్స్పెక్టర్ వదిలి సన్యాసిగా మారిన అధికారి.. ఎందుకంటే!
విడాకుల నిర్ణయాన్ని మార్చిన భర్త ప్రేమ.. కన్నీళ్లతో తిరిగొచ్చిన భార్య..