తేలియాడే మంచుకొండపై నుంచి డైవ్.. చరిత్ర సృష్టించిన మహిళా క్రీడాకారిణి
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:28 PM
గడ్డకట్టే సముద్రం.. చుట్టూ భారీ మంచుకొండలు.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో ఓ మహిళా క్రీడాకారిణి అసాధారణ సాహసంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా 15 మీటర్ల ఎత్తైన మంచుకొండపై నుంచి సముద్రంలోకి డైవ్ చేసి చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆ సాహసం వెనుక ఉన్న కథేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: సాహసం చేయాలంటే ధైర్యంతో పాటు పట్టుదల.. ఎంతో సాధన కూడా అవసరం. ఈ విషయాన్ని కెనడాకు చెందిన హై డైవర్ మోలీ కార్ల్సన్ నిరూపించారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తేలియాడుతున్న మంచుకొండపై నుంచి సుమారు 15 మీటర్ల ఎత్తులో వెనక్కి డైవ్ చేసి ఆమె అరుదైన ఘనత సాధించారు. కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతం ట్విల్లింగేట్ తీరంలో గడ్డకట్టే చల్లటి నీటిలోకి ఆమె చేసిన ఈ సాహసోపేతమైన జంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రెడ్ బుల్ ఐస్‌బర్గ్ డైవ్‌లో భాగంగా నమోదైన ఈ ప్రయత్నం వెనుక నాలుగేళ్ల ప్రణాళిక, నెలల తరబడి శిక్షణ ఉన్నాయి. రెడ్ బుల్ క్లిఫ్ డైవింగ్ వరల్డ్ సిరీస్‌లో తన ప్రదర్శనలతో గుర్తింపు పొందిన మోలీకి ఎత్తుల నుంచి నీటిలోకి దూకడం కొత్తేమీ కాదు. అయితే, స్థిరమైన వేదికపై నుంచి కాకుండా ఎప్పుడైనా కదిలే, పగిలిపోయే లేదా బోల్తా పడే ప్రమాదమున్న మంచుకొండపై నుంచి డైవ్ చేయడం పూర్తిగా భిన్నమైన సవాలు. అందుకే సరైన మంచుకొండను గుర్తించడం, వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, సముద్రపు అలలను పరిశీలించడం వంటి అంశాలపై బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఈ సాహసానికి సిద్ధమయ్యేందుకు మోలీ చల్లటి నీటిలో శిక్షణ తీసుకోవడంతో పాటు ప్రత్యేకమైన వెట్సూట్లను పరీక్షించారు. కెనడియన్ పర్వతారోహకుడు విల్ గాడ్ మార్గదర్శకత్వంలో మంచు ఎక్కే మెళకువలను కూడా నేర్చుకున్నారు. బృందం న్యూఫౌండ్‌ల్యాండ్‌కు చేరుకున్న తర్వాత కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకూ వేచి చూడాల్సి వచ్చింది. 20 మీటర్లకు పైగా ఎత్తుల నుంచి డైవింగ్ చేసిన అనుభవం ఉన్నప్పటికీ, మంచుకొండపై నుంచి దూకడం తన జీవితంలో అత్యంత భయానకమైన సవాళ్లలో ఒకటని మోలీ పేర్కొన్నారు. చివరకు సరైన అవకాశం రావడంతో సుమారు 15 మీటర్ల ఎత్తు నుంచి వెనక్కి డైవ్ చేసి అట్లాంటిక్ జలాల్లోకి దూకారు. ఆ క్షణంలో దాదాపు పది నిమిషాల పాటు గాలిలో తేలుతున్నట్లు అనిపించిందని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ఎన్నో ఏళ్లుగా కలలు కన్న సాహసాన్ని పూర్తి చేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి: కేటీఆర్
వీసా వస్తుందో రాదోనని ఆందోళన.. అత్తాపూర్‌లో యువకుడి మృతి
Read Latest Telangana News And Telugu News