Share News

కృష్ణా...రామా’ అంటూ ఓ మూల కూర్చోకుండా...

ABN , Publish Date - Jan 25 , 2026 | 10:07 AM

ఎనభై ఏళ్ల వృద్ధులు ఏం చేస్తారు? ‘కృష్ణా...రామా’ అంటూ ఓ మూల కూర్చుంటారు. లేదా అనారోగ్యంతో బాధపడుతుంటారు. కానీ 82 ఏళ్ల దై షూయింగ్‌ మాత్రం డ్రోన్‌తో వ్యవసాయం చేస్తూ వార్తల్లో నిలిచారు.

కృష్ణా...రామా’ అంటూ ఓ మూల కూర్చోకుండా...

- డ్రోన్‌ బామ్మ!

ఎనభై ఏళ్ల వృద్ధులు ఏం చేస్తారు? ‘కృష్ణా...రామా’ అంటూ ఓ మూల కూర్చుంటారు. లేదా అనారోగ్యంతో బాధపడుతుంటారు. కానీ 82 ఏళ్ల దై షూయింగ్‌ మాత్రం డ్రోన్‌తో వ్యవసాయం చేస్తూ వార్తల్లో నిలిచారు. ముదిమి వయసులో ఆమె జీవన విధానం అందరికీ ఆశ్చర్యకరమే గాక స్ఫూర్తిదాయకం కూడా.

‘‘హాయ్‌ ఫ్రెండ్స్‌... ఇవి మా తోటలో పండిన టమాటాలు, వంకాయలు, క్యాబేజీలు. చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి కదూ. ఇప్పుడే తెంచుకుని వచ్చాను. ఈ ఏడాది చక్కటి వర్షాల వల్ల వరి బాగా పండింది. ఇదుగో రాశులుగా పోశాం. ఇది జపానియా బియ్యం, అది ఇండికా బియ్యం, ఇంకా అదేమో జాస్మిన్‌ బియ్యం. ఈ సాయంత్రం వీటన్నింటినీ బస్తాల్లోకి ఎత్తించాలి’’ అని ఓ బామ్మ తన పొలం గట్టు మీద నుంచే లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తుంటే... అనేకమంది ఆసక్తిగా ఆ వీడియో చూస్తున్నారు. ఆవిడ పేరు దై షూయింగ్‌. వయసు 82 ఏళ్లు. అంత పెద్దావిడ వ్యవసాయం చేస్తోందా? అనే అనుమానం ఒకవైపు, తనే స్వయంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తోందా? అనే ఆశ్చర్యం మరోవైపు కలగకమానవు.


book4.jpgతొలితరం విద్యాధికురాలు...

దై షూయింగ్‌ స్వస్థలం ఉత్తర చైనాలోని అన్‌హుయి ప్రావిన్స్‌కు చెందిన గ్జిండు నగరం దగ్గరలోని లామీ గ్రామం. ఆ గ్రామంలో తొలి తరం విద్యాధికుల్లో ఆమె కూడా ఒకరు. చద వడం, రాయడమే కాదు... లెక్కలు కూడా ఆమెకు బాగా వచ్చని ఈనాటికీ ఆ గ్రామంలో బామ్మ గారి గురించి గొప్పగా చెబుతారు. అప్పట్లో ఆమె ఓ పుస్తకాల షాపును నడిపేపారు. వయసు పైబడ్డాక దాన్ని విక్రయించారు.

దైకి అయిదుగురు సంతానం. పెద్ద కొడుకు తప్పిస్తే మిగతా అందరూ పట్టణాలకు వలస వెళ్లిపోయారు. నలభై హెక్టార్ల పొలంలో వ్యవసాయం చేస్తోన్న తల్లికి ఆసరాగా ఉండేవాడు పెద్దకొడుకు మాత్రమే. ఆయన తన అనారోగ్యం కారణంగా కొడుకు వాంగ్‌ను పొలానికి పంపించేవాడు. ఇంకా పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తోన్న బామ్మకు చేయూతను అందించేందుకు మనవడు వ్యవసాయ డ్రోన్లను తీసుకువచ్చాడు.


డ్రోన్‌తో సరికొత్త పాఠాలు...

యంత్రంలా కనిపించే ఇనుప డ్రోన్‌లు దై షూయింగ్‌ మొదట అర్థం కాలేదు. వాటి పనితీరును తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఆ తరవాత దానిని ఎలా ఎగరేయాలో తనకి నేర్పించమని మనవడిని కోరింది. అతను చక్కని టీచర్‌లా ఎంతో ఓపికగా బామ్మగారికి అన్నీ నేర్పించాడు. ఇక అంతే... చక్కని విద్యార్థిలా చకచకా నేర్చేసుకుంది బామ్మ. మెల్లిగా డ్రోన్ల పనితీరును అర్థం చేసుకుంది. బరువైన 15 కిలోల బ్యాటరీలను అమర్చడం, డ్రోన్‌ రెక్కలను తెరవడం, అందులో ఎరువులు, పురుగుమందులను దట్టించడం, ఆఖరుకి డ్రోన్లను ఎగరవేయడమూ నేర్చుకుంది.


book4.2.jpg

ఈ నవతరం డ్రోన్ల వల్ల వాళ్ల జీవనం ఒక్కసారిగా మారిపోయింది. ‘మొదట్లో అర హెక్టార్‌లో విత్తనాలు చల్లేందుకు ఓ మనిషికి రోజంతా పట్టేది. ఇప్పుడు డ్రోన్‌ వల్ల నలభై హెక్టార్లలో పనిని ఒకేరోజులో చేసేస్తున్నాం. ఈ వయసులో కొత్త ప్రపంచాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంద’ని మురిసిపోతోంది బామ్మ.

‘ఓల్డ్‌ ఫార్మర్‌, గ్రేట్‌ఫుల్లీ లవ్డ్‌’ అనే పేరుతో బామ్మ దైనందిన జీవితాన్ని షార్ట్‌ వీడియోగా రూపొందించాడు వాంగ్‌. పొలాల మధ్యలో డ్రోన్‌ ఎగరవేస్తూ హడావుడిగా అటూఇటూ తిరుగుతూ వ్యవసాయం చేస్తున్న ఈ బామ్మ వీడియో రెండు లక్షలకు పైగా వ్యూస్‌ అందుకుని వీళ్లకు కొత్త ఆలోచనను రేకెత్తించింది.


బామ్మామనవడు కలిసి ఏకంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. అందులో తమ పొలం, తోట... పండిన కూరగాయలు, వరి ధాన్యం గురించి విశేషాలు చెప్పడం మొదలుపెట్టారు. ఒక్కోసారి దై సొంతంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తుంటుంది. చాలామంది ఆమె కొనసాగించే వ్యయసాయ కార్యకలా పాలను చూడడానికే లాగిన్‌ అవడం విశేషం. ఎనభై రెండేళ్ల ముదిమి వయసులో కూడా ఎంతో చలాకీగా పనులు చేస్తున్న ఆవిడని చూసి ఆశ్యర్యపోతు న్నారంతా. ‘డ్రోన్‌ బామ్మ’, ‘నిబద్ధత కలిగిన బామ్మ’ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

చిల్లర పనులకు రాలేదు

అమరావతిని అడ్డుకోలేరు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2026 | 11:50 AM