అంత్యక్రియలకు ముందు మృతుడి బొటనవేలి ముద్రలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:29 AM
లక్నోలో 75 ఏళ్ల వృద్ధుడి అంత్యక్రియలకు ముందు ఖాళీ కాగితాలపై ఆయన బొటనవేలి ముద్రలు తీసుకున్నట్లు కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..
ఇంటర్నెట్ డెస్క్: లక్నోలో 75 ఏళ్ల వృద్ధుడి అంత్యక్రియలకు ముందు ఖాళీ కాగితాలపై అతని బొటనవేలి ముద్రలు తీసుకున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. రహీమాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖదౌన్హా గ్రామంలో ఛత్రపాల్ అనే వృద్ధుడు జూలై 9న మృతి చెందినట్లు సమాచారం. ఆయన అంత్యక్రియలకు ముందు కొంతమంది వ్యక్తులు మృతదేహం నుంచి బొటనవేలి ముద్రలు తీసుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ పత్రాలను ఎందుకు సిద్ధం చేశారు? వాటిపై ముద్రలు ఎందుకు తీసుకున్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారానికి కుటుంబ ఆస్తి వివాదంతో సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ముద్రలు ఆస్తి బదిలీకి లేదా ఇతర చట్టపరమైన లావాదేవీలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో తీసుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదు. వైరల్ వీడియోను పోలీసులు పరిశీలిస్తూ.. అందులో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలు, ఘటన జరిగిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
కుటుంబ ఆస్తి వివాదం.. బంధువుల సంచలన ఆరోపణలు
ఛత్రపాల్ కుటుంబంలో చాలాకాలంగా ఆస్తి వివాదం కొనసాగుతోందని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. ఛత్రపాల్ ఆయన భార్య శివదేవికి తమ కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మితో విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2023లో వృద్ధ దంపతులను ఇంటి నుంచి వెళ్లగొట్టారని.. ఆ తర్వాత వారు బంధువుల వద్ద ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం ఛత్రపాల్ తన కుమారుడు, కోడలికి తన ఆస్తిని ఇవ్వనని బహిరంగ ప్రకటన చేసినట్లు బంధువులు ఆరోపించారు. ఈ పరిణామాలతో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా క్లారిటీ లేదు.
తండ్రి మరణం తర్వాత వైరల్ వీడియో.. పోలీసుల దర్యాప్తు
ఛత్రపాల్ ఆరోగ్యం జూలై 7న క్షీణించిందని ఆయన కుమార్తె తెలిపినట్లు సమాచారం. తండ్రి పరిస్థితి గురించి మహేంద్రకు సమాచారం ఇవ్వగా.. చికిత్స చేయిస్తానని చెప్పి ఆయనను గ్రామానికి తీసుకెళ్లాడని ఆమె ఆరోపించింది. అయితే గ్రామానికి తీసుకెళ్లిన రెండు రోజులకే జూలై 9న ఛత్రపాల్ మృతి చెందినట్లు ఆయన కుమార్తె పేర్కొంది. అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన కుమార్తెలతో మహేంద్రకు వివాదం జరిగినట్లు కూడా ఆమె ఆరోపించింది. ఆ తర్వాత మృతుడి బొటనవేలి ముద్రలు తీసుకుంటున్న వీడియో బయటకు రావడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు అందలేదని రహీమాబాద్ పోలీసులు తెలిపారు. వైరల్ ఫుటేజీ నిజమైనదేనా, అది ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో చిత్రీకరించబడింది, మృతుడి వేలిముద్రలు ఎందుకు తీసుకున్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
ముంబై రైలా మజాకా.. కొరియా వ్యక్తికి చుక్కలు కనిపించాయిగా..
ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. రైలు ఎక్కుతుండగా..