Cobra Viral Video: నాగు పాముతో అతి చేశాడు.. ప్రాణాలు పోయాయ్..
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:58 PM
ఓ వ్యక్తి పామును పట్టుకుని మెడలో వేసుకుని అతిచేస్తూ ఫోజులు కొట్టాడు. పాముతో ఆటలాడతున్న అతడ్ని చూసి జనం భయపడిపోయారు. చివరకు.. ఆ పాము అతణ్ని కాటు వేయటంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు.
ఓ వ్యక్తి నాగు పామును చేతుల్లోకి తీసుకుని అతి చేశాడు. దాన్ని అటూ ఇటూ తిప్పుతూ జనం ముందు ఫోజులు కొట్టాడు. విష సర్పంతో ఆటలు.. ఏకంగా అతడి ప్రాణాలు తీసేశాయి. మూడుసార్లు అతణ్ని నాగుపాము కాటేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రామ్‌పూర్‌కు చెందిన 50 ఏళ్ల రాజ్ సింగ్‌కు పొలాల దగ్గర ఓ నాగుపాము కనిపించింది. సుమారు ఆరు అడుగులు ఉన్న ఆ పామును అతడు ఏ మాత్రం భయపడుకుండా పట్టుకున్నాడు. అలా పట్టుకుని.. దానితో ఆటలు ఆడటం మొదలెట్టాడు. అటూ ఇటూ తిప్పుతూ అతి చేశాడు.
తర్వాత రోడ్డు మీదకు వచ్చి మరింత అతి చేశాడు. పామును మెడలో వేసుకుని ‘నాలాంటి వీరుడ్ని మీరు ఎప్పుడైనా చూశారా?’ అంటూ తెగ ఫోజులు కొడుతూ తిరిగాడు. పామును పట్టుకుని తిరుగుతున్న అతడ్ని చూసి జనం భయపడిపోయారు. అతడు దగ్గరకు వస్తుంటే దూరంగా పరుగులు తీశారు. కొంతమంది అతడికి హితవు పలికారు. పామును వదిలిపెట్టమని, లేదంటే చచ్చిపోతావని హెచ్చరించారు. అయినా కూడా రాజ్ సింగ్ వారి మాటలు పట్టించుకోలేదు. పామును చాలా ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించాడు. సహనం నశించిన పాము మూడుసార్లు అతడ్ని కరిచింది. పాము కాట్ల కారణంగా అతడి పరిస్థితి విషమించింది.
కొద్దిసేపటికే ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాజ్ సింగ్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం రాజ్ సింగ్ పాముతో అతి చేసిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ప్రమాదకరమైన పాముతో ఆడుకోవటం నిజంగా పిచ్చితనమే’.. ‘వీర మరణం పొందావు రాజ్ సింగ్’.. ‘అతడు తాగినట్లు ఉన్నాడు. అందుకే అలా ప్రవర్తించాడు’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఇండియాకు చేరిన రెండు విమానాలు
పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు టీచర్లు మృతి