Iran Protests News: ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఇండియాకు చేరిన రెండు విమానాలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:05 PM
ఇరాన్ నుంచి బయల్దేరిన రెండు కమర్షియల్ విమానాలు భారతీయులతో శుక్రవారం ఢిల్లీ చేరుకున్నాయి. అయితే.. ఆ రెండూ రెగ్యులర్ విమానాలే. భారతీయులను ఇరాన్ నుంచి ఇండియాకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలు కాదు.
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరసనల కారణంగా ఇప్పటివరకు సుమారు రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత త్వరగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. శుక్రవారం రాత్రి రెండు కమర్షియల్ విమానాలు భారతీయులతో ఢిల్లీ చేరుకున్నాయి. అయితే.. అవి రెండూ రెగ్యులర్ విమానాలే. భారతీయులను ఇరాన్ నుంచి ఇండియాకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాలు కాదు. ఇక.. భారత ప్రభుత్వం అక్కడి పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యవసరమైతే తప్ప ఇరాన్‌కు ప్రయాణించవద్దని భారతీయులను హెచ్చరించింది. ఇరాన్ ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో జనవరి 15 నుంచి రెండు దేశాల మధ్య పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే ఎయిర్ స్పేస్ పరిస్థితులు సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. దీంతో భారతీయులు అక్కడి నుంచి ఇండియాకు వచ్చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తమకు ఎంతో సాయం చేసిందని అంటున్నారు. శుక్రవారం రాత్రి ఇండియాకు చేరుకున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నిరసనల గురించి విన్నాను. కానీ, నేరుగా చూడలేదు. అక్కడ ఇంటర్‌నెట్ కూడా లేదు’ అని చెప్పుకొచ్చారు.
మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘మేము బయటకు వెళ్లినపుడు నిరసనకారులు కారుకు అడ్డంగా వచ్చారు. కొంచెం ఇబ్బంది పెట్టారు. అక్కడ ఇంటర్‌నెట్ కూడా లేదు. ఆ కారణంతో ఇండియాలోని మా కుటుంబాలకు విషయం చెప్పలేకపోయాం. ఆఖరికి ఇండియన్ ఎంబసీని కూడా సంప్రదించలేకపోయాం’ అని వాపోయారు. ఓ ఇంజనీర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. నెట్‌వర్క్ సమస్యలు ఉన్నాయి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
ప్రాణం మీదకు తెచ్చిన పిల్లచేష్టలు.. తొండను విసిరిన అన్న..