Share News

చిరుతతో కుక్క పోరాటం.. 7 నిమిషాల హైడ్రామా! వీడియో వైరల్

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:35 AM

చిరుతపులి దాడి చేస్తే ఏ జంతువైనా భయంతో పరుగులు తీస్తుంది.. కానీ ఆ పెంపుడు కుక్క మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు చిరుతతోనే ఢీ కొట్టింది. ఏకంగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు జరిగిన ఈ భీకర పోరాటం సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరుతతో కుక్క పోరాటం.. 7 నిమిషాల హైడ్రామా! వీడియో వైరల్
Leopard Dog Fight

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముర్బాద్ తాలూకా సఖారే గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లోకి అకస్మాత్తుగా చిరుతపులి ప్రవేశించింది. అక్కడ ఉన్న ‘రాకీ’ అనే పెంపుడు కుక్కపై చిరుత దాడి చేయడంతో.. ప్రాణాలను కాపాడుకునేందుకు రాకీ ఎదురుతిరిగింది. దీంతో చిరుత, కుక్క మధ్య కొన్ని నిమిషాల పాటు భీకర పోరు జరిగింది. దాదాపు ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు సాగిన ఈ నాటకీయ ఘర్షణ మొత్తం ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.


చిరుత దాడి చేస్తున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎదుర్కొన్న కుక్క.. ఏకంగా చిరుత దవడను పట్టుకున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించినట్లు సమాచారం. ఈ ఫామ్‌హౌస్ స్థానిక ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తికి చెందినదిగా తెలుస్తోంది. ఈ ఘటనతో సఖారే గ్రామం.. పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, నివాస ప్రాంతాలకు సమీపంలో చిరుత సంచరించడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వన్యప్రాణుల కదలికలు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్.. వీడియో వైరల్

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..

Updated Date - Sep 09 , 2026 | 12:18 PM